అమూల్ సంస్థ.. పాలు, పాల ఉత్పాదనలకు పేరున్న సంస్థ ఇది. అమూల్ పాలు తాగుతోంది ఇండియా అంటూ యాడ్లు చూస్తూనే ఉంటాం. అయితే గుజరాత్‌ కు చెందిన ఈ పాల సహకార సంస్థ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరు కొనసాగిస్తోంది. అమూల్ సంస్థ ద్వారా పాల వెల్లువ అనే కార్యక్రమాన్ని ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఈ మేరకు అమూల్‌ సంస్థతో ఏపీ సర్కారు ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఏపీ రైతుల పాలకు మంచి ధర వస్తోందని ప్రభుత్వం చెబుతోంది.


అయితే.. ఏపీలో అమూల్ డైరీ కార్యక్రమాల విస్తరణను విపక్షాలు తప్పుబడుతున్నాయి. జగన్ రాష్ట్రంలోని కొన్ని డెయిరీలను టార్గెట్ చేసి అమూల్‌ను ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఇదే సమయంలో అమూల్ సంస్థ తెలంగాణలోనూ కార్యక్రమాలు ఉధృతం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అమూల్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు అమూల్ సంస్థ తెలంగాణ తో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలోనే ఈ  ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అమూల్ సంస్థ బేకరీ పదార్థాల తయారీ యూనిట్లు తెలంగాణలో ఏర్పాటు చేయబోతోంది.


అమూల్ సంస్థ రెండు దశల్లో తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. తెలంగాణలో అమూల్‌ సంస్థ ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి లభించబోతోంది. ఈ సందర్భంగా అమూల్ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు మంత్రి  కేటీఆర్‌. అమూల్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.


అయితే ఏపీలోని విపక్ష పార్టీ అయిన టీడీపీ నేతలు మాత్రం.. అమూల్ ఏపీ వనరులు దోచుకుంటూ పెట్టుబడులు మాత్రం తెలంగాణలో పెడుతోందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని సహకార డెయిరీలను దెబ్బకొట్టేందుకు తీసుకొచ్చిన అమూల్ పాల కంపెనీకి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రజల నుండి అడ్డమైన పన్నులతో ముక్కుపిండి వసూలు చేసిన సొమ్ము అమూల్ కు రూ.2500 కోట్లు ధార పోశారని విమర్శిస్తున్నారు. ఈ సొమ్ముతోనే అమూల్ సంస్థ తెలంగాణలో రూ.500 కోట్లతో భారీ డెయిరీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని.. ఇది జగన్ రెడ్డికి తలవంపుగా లేదా అని ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: