ఒక మాజీ ఎంపీ తెలంగాణాలోని అన్ని పార్టీలను బాగా టెన్షన్ పెట్టేస్తున్నారట. కారణం ఏమిటంటే ఈమధ్యనే అమరావతికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వటమేనట. తెలంగాణాలో మాజీ ఎంపీ ఏపీలో జగన్ను కలిస్తే టెన్షన్ ఏముంది ? అసలు విషయం ఏమిటంటే నాలుగు రోజుల క్రితం ఖమ్మం వైసీపీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి అమరావతికి వెళ్ళి జగన్ తో భేటీ అయ్యారు. ఈయన ప్రస్తుతం టీఆర్ఎస్ నేత.




టీఆర్ఎస్ నేత జగన్ తో ఎందుకు భేటీ అయ్యారో ఎవరికీ అర్ధం కావటంలేదు. దాంతో వీళ్ళ భేటీ విషయమై అన్నీ పార్టీలు ఆరాలు తీస్తున్నాయి. ఈ భేటీకి కాస్త చరిత్రుంది. అదేమిటంటే పొంగులేటి టీఆర్ఎస్ లో నుండి బయటకు వెళ్ళిపోతారనే టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో తమ పార్టీల్లో చేరమని బీజేపీ, కాంగ్రెస్ నుండి ఆఫర్లు వస్తున్నాయట. పొంగులేటి పెద్ద కాంట్రాక్టర్. కాబట్టి అర్ధ, అంగబలాలకు ఎలాంటి లోటు లేనివ్యక్తి. జిల్లా వ్యాప్తంగా మద్దతుదారులున్నారు.




తెలంగాణాలో వైసీపీ ఉనికే పెద్దగా లేని 2014లోనే తాను ఖమ్మం ఎంపీగా గెలవటమే కాకుండా జిల్లాలో ముగ్గురిని ఎంఎల్ఏలుగా గెలిపించుకున్నారు. కాబట్టి రాజకీయంగా జిల్లాపై పట్టుందనే అనుకోవాలి. ఇలాంటి నేతను చేర్చుకోవటం కోసం బీజేపీ, కాంగ్రెస్ లు ప్రయత్నించటంలో ఆశ్చర్యమేమీలేదు. అసలు మంచి పదవులిస్తానని, గుర్తింపిస్తానని కేసీయార్ హామీ ఇస్తేనే పొంగులేటి గతంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే చేరిన తర్వాత కేసీయార్ పెద్దగా పట్టించుకోలేదు.




దాంతో టీఆర్ఎస్ లో ఉండాలా లేకపోతే బయటకు వచ్చేయాలా అనే డౌలమాలో ఉన్నారు పొంగులేటి. పొంగులేటి ఊగిసలాట తెలియటంతోనే పై రెండుపార్టీలు ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పొంగులేటి అమరావతికి వెళ్ళి జగన్ తో భేటీ అవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. మొదటినుండి జగన్ కు పొంగులేటి గట్టి మద్దతుదారుడు. అందుకనే రాజకీయ భవిష్యత్తు విషయంలో  సలహా కోసమే పొంగులేటి ఏపీ సీఎంను కలిసినట్లు ప్రచారంలో ఉంది.




తెలంగాణా నేతకు జగన్ ఏమని సలహా ఇచ్చారో అర్ధం కావటంలేదు. ఒకవేళ పొంగులేటి గనుక టీఆర్ఎస్ ను వదిలేస్తే పార్టీకి పెద్ద దెబ్బనే చెప్పాలి. ఈ మాజీ ఎంపీ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి ప్లస్ అవుతుందే కానీ మైనస్ మాత్రం కాదు. మరి జగన్ ఏమి చెప్పారో ? పొంగులేటి ఏమి చేస్తారో తెలీకే పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: