పంజాబ్‌ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయం రంజుగా మారుతోంది. పంజాబ్‌లో ఇప్పుడు బహుముఖ పోరు నెలకొన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే వరుసగా పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో సహజంగానే ఆ పార్టీని ప్రభుత్వ వ్యతిరేకత ఇబ్బందికరంగా ఉంది. దీనికి తోడు చివరి ఏడాదిలో సీఎంను మార్చడం.. మాజీ సీఎం పార్టీ వీడి వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టుకోవడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.


మరోవైపు అకాలీదళ్, బీజేపీలలో అంత జోష్ కనిపించడంలేదు.. ఇలాంటి సమయంలో ఆప్‌ మాత్రం జోరుగా దూసుకుపోతోంది. ఇటీవల చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆప్‌ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఢిల్లీ తరహాలో పంజాబ్‌ను కైవసం చేసుకునేందు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం చేపట్టిన సర్వే ప్రక్రియ అంతటా ఆసక్తి రేపింది. దేశంలో ఇలా సీఎం అభ్యర్థి కోసం సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి కావచ్చు.


అయితే.. ఈ సర్వే పక్రియ అంతా ఓ స్కామ్‌ అని కాంగ్రెస్‌ పంజాబ్‌ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆప్‌ చేసిన సర్వే ఓ పెద్ద స్కామ్‌ అంటున్నారు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ.. కేవలం నాలుగు  రోజుల్లో 22 లక్షల కాల్స్‌ అందుకున్నామని ఆప్‌ చెబుతోందని.. ఇది అసాధ్యమని నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆరోపిస్తున్నారు.


ఆప్‌ ప్రజల్ని మోసగించేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోందని.. ఆ ప్రయత్నం మానుకోవాలని నవజోత్‌ సింగ్‌ సిద్ధూ హితవు పలికారు. ఆ సర్వే నిజమైతే... కాల్‌ రికార్డులు చూపించాలని నవజోత్‌ సింగ్‌ సిద్ధూ సవాల్‌ విసిరారు. అంతే కాదు.. ఆప్‌ సర్వేపై ఎన్నికల సంఘానికి కూడా కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసినట్లు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ చెబుతున్నారు. అయితే నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆరోపణలను ఆప్‌ కొట్టిపారేస్తోంది. ఓటమి భయంతోనే సిద్ధూ తమపై ఇలాంటి అభాండాలు వేస్తున్నారని ఆప్‌ అంటోంది. కాంగ్రెస్‌ తరహా రాజకీయాలకు కాలం చెల్లిందని.. ఆప్‌ను పంజాబ్‌ ప్రజలు ఆదరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: