తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌ హైకమాండ్ మెచ్చుకుంది.. ఏ విషయంలోనో తెలుసా.. కాంగ్రెస్ పార్టీ ఇటీవల జోరుగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేయిస్తోంది. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగిందట. ఇది లక్ష్యానికి మించి జరిగిందని కాంగ్రెస్ హైకమాండ్ మెచ్చుకుందట. అందుకే.. ఈ సభ్యత్వ నమోదు మరింత జోరుగా చేయించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ప్రతి ఎన్నికల బూత్ లలో వందకు తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయించాలని నిర్ణయించారు. అలాగే ప్రతి మండలంలోనూ 10 వేలు సభ్యత్వాలు.. ప్రతి  నియోజకవర్గంలోనూ 50 వేల సభ్యత్వాలు తప్పనిసరిగా చేయించాలని టీపీసీసీ ప్రయత్నిస్తోందట.


ఇప్పటికే లక్ష్యాన్ని మించి సభ్యత్వాలు చేయించినందుకు రేవంత్ రెడ్డికి ప్రశంసలు దక్కుతున్నాయట. ఈ సభ్యత్వ నమోదు లక్ష్యం అధిగమించినందుకు గుర్తుగా గాంధీ భవన్ ను విద్యుత్ దీపాలతో అలంకరించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించాయి. అంతే కాదు.. సభ్యత్వాలు లక్ష్యం మేరకు చేసిన వారిని మనిక్కమ్ ఠాగూర్, రేవంత్ రెడ్డి సన్మానం కూడా చేస్తారట.


ఇప్పటికి తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు 31 లక్షలు దాటాయట. ఈ కాంగ్రెస్ సభ్యత్వాలపై రేపు  ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పిఆర్వో, ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకాబోతున్నారు. డీసీసీ అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కో ఆర్డినెటర్స్ సమావేశం ఉంటుందని.. సాయంత్రం పీఏసీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.


రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చిన విషయం తెలిసిందే. అందుకే పార్టీలో సభ్యత్వ నమోదు అంత జోరుగా జరిగింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక సాధించిన విజయాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో అధికార పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం తామే అని కాంగ్రెస్‌ నిరూపించుకునే అవకాశం ఈ సభ్యత్వ నమోదు ద్వారా దక్కిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: