మరోవైపు కరోనా వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సేవలను ఏప్రిల్ నుంచి ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఈ నెల 28 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై పౌరవిమానయాన శాఖ, ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
ఇక మన దేశంలో 24గంటల్లో కొత్తగా 30వేల 757 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ తో 541మంది మరణించారు. తాజాగా 67వేల 538మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4కోట్ల 19లక్షల 10వేల 984కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 32వేల 918యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 172కోట్ల 24లక్షల 36వేల 288 వ్యాక్సిన్ డోసులు వేశారు.
గోవా 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతున్న క్రమంలో గోవా రెండు డోసులు వేసి వ్యాక్సినేషన్ 100శాతం పూర్తి చేసింది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా.. రెండో డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ అందించే విషయంలో గోవా ముందడుగు వేసింది.
ఇక కరోనా ను వ్యాక్సిన్ లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న 6నెలల తర్వాత కూడా కొవిడ్ 19కు కారణమయ్యే వైరస్ ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ.. వాటి నాణ్యత వల్ల కోవిడ్ ను ఎదుర్కొనే సామర్థ్యం అలాగే కొనసాగుతోందని సైంటిస్టులు పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి