ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కొడుకు గల్లా అశోక్ ఒకడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'హీరో' సినిమాతో సినిమాల్లోకి వచ్చాడు గల్లా అశోక్. ఇక ఈ హీరోకి తన తండ్రి వైపు నుంచి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే, అమ్మ వైపు సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంది. సూపర్‌ స్టార్ కృష్ణ పెద్ద కూతురు పద్మావతి, గల్లా జయదేవ్‌ కొడుకే గల్లా అశోక్. ఇక ఈ కుర్రాడి ఫస్ట్ సినిమా గల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లోనే తెరకెక్కింది.

కర్నాటక రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన గాలి జనార్ధన్‌ కొడుకు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వారాహి బ్యానర్‌లో కిరీటీ హీరోగా లాంచ్‌ అవుతున్నాడు. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ తెరకెక్కబోతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

కర్నాటకలో పొలిటికల్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో కూడా వచ్చాడు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిఖిల్‌ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. 'జాగ్వర్' సినిమాతో తెలుగు ఆడియన్స్‌ని కూడా పలకరించాడు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ నిఖిల్‌ పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ సినిమాలతో బిజీ అయ్యాడు నిఖిల్ గౌడ.

తమిళనాడులో సినిమాలు, రాజకీయాలకి దగ్గరి సంబంధం ఉంది. చాలామంది సినిమా స్టార్లు రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ వారసుడు ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌ ఎమ్.ఎల్.ఎ.గా కూడా ఉన్నాడు.

మరాఠా, హిందీ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రితేష్ దేశ్‌ముఖ్. ఈ హీరో ఫ్యామిలీకి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ కొడుకే రితేష్‌ దేశ్‌ముఖ్. అన్నయ్య, తమ్ముడు తండ్రి బాటలో రాజకీయాల్లోకి వెళ్లినా రితేష్‌ మాత్రం హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా సినిమాలు చేస్తున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: