జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టీడీపీలోని బీసీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతున్నట్లే ఉంది. ఈనెల 7వ తేదీన విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ పేరుతో ప్రతినిధుల సభ జరగబోతోంది. బహిరంగసభ కాకపోయినా సుమారు 90 వేలమంది ప్రతినిధులతో సభ నిర్వహించాలని జగన్ డిసైడ్ చేశారు. ఆ సభలో మూడున్నరేళ్ళల్లో తమ ప్రభుత్వం బీసీ సామాజికవర్గాలకు చేసిన మేళ్ళతో పాటు చేయబోయేది కూడా జగన్ వివరించబోతున్నారు.
                                     

ఎప్పుడైతే జయహో బీసీ సభను ప్రకటించిందో అప్పటినుండి టీడీపీ బీసీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు జగన్ను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు. జగన్ మంత్రివర్గంలోని బీసీ మంత్రులంతా చేతకాని వాళ్ళంటు కొల్లు మండిపడ్డారు. బీసీ మంత్రులు బీసీల భవిష్యత్తును జగన్ దగ్గర తాకట్టుపెట్టారని రెచ్చిపోయారు.

బీసీలకు జరిగిన మేలంతా చంద్రబాబునాయుడు హయాంలోనే జరిగిందన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీగా ముద్రవేసుకున్నట్లు చెప్పారు. అయితే ఇక్కడ చంద్రబాబుతో పాటు కొల్లు, అచ్చెన్న, యనమల, చింతకాయల మరచిపోయిన విషయం ఒకటుంది. టీడీపీ హయాంలోనే బీసీలకు అంత మేళ్ళు జరిగితే మరి మొన్నటి ఎన్నికల్లో ఎందుకని టీడీపీని దూరంపెట్టారు ? టీడీపీ బీసీల పార్టీ అనేది ఒకప్పటి మాట. కచ్చితంగా చెప్పాలంటే ఆ మాట ఎన్టీయార్ హయాంలో ఉండేది.

ఎన్టీయార్ పుణ్యమాని కొంతకాలం అలాగే నెట్టుకొచ్చారు. కానీ చంద్రబాబు వైఖరి చూసిన తర్వాత బీసీలు మెల్లిగా టీడీపీకి దూరమైపోయారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంఘాల నేతలను చంద్రబాబు ఎంత చులకనగా మాట్లాడారో అందరు చూసిందే. తోకలు కత్తిరిస్తా, అరెస్టుచేసి జైల్లో పెట్టిస్తా, సెక్రటేరియట్లోకి ఎవరు రానిచ్చారని అందరిముందు బీసీ సంఘాల నేతలను అవమానించారు.  

ఇదే సమయంలో జగన్ బీసీలకు బాగా ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టారు. దీంతోనే మెజారిటి బీసీలు టీడీపీని వదిలేసి వైసీపీ వైపు మొగ్గుచూపారు. దాంతోనే వచ్చేఎన్నికల్లో గెలుపు విషయంలో టీడీపీలో వణుకుమొదలైంది. దానికితోడు బీసీ ప్రతినిధులతో సభ పెట్టుకోవటాన్ని టీడీపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే తమ్ముళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: