ఏపీ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎంఎల్ఏలపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేస్తారా ? అందుకు వీళ్ళెలా రియాక్టవుతారు ? అన్నది ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. విషయం ఏమిటంటే అనర్హత వేటు విషయంలో  స్పీకర్ ముందు విచారణకు హాజరవటానికి వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి నిరాకరించారు. తనపై ఎలాంటి ఆధారాలతో అనర్హత వేటు వేయాలని వైసీపీ అడిగిందో చెప్పాలని స్పీకర్ ను అడిగారు.





తాను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు చెబుతున్న సర్టిఫైడ్ కాపీలను తనకు ముందు అందించాలని కూడా ఆనం డిమాండ్ చేశారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే విషయాన్ని లాగదీయటానికే అని తెలిసిపోతోంది. ఏ ఎంఎల్ఏ కూడా తాను తప్పుచేశాను కాబట్టి తనపై అనర్హత వేటు వేయటం సబబే అని స్పీకర్ తో చెప్పరు. ఎంఎల్ఏకి చేతనైంది తాను చేసుకుపోతుంటారు. స్పీకర్ చేయగలిగింది తాను చేసుకుపోవాలంటే. మధ్యలో జరిగేదంతా కేవలం ప్రొసీజర్ మాత్రమే.





మొత్తానికి స్పీకర్ విచారణకు తాను రానని ఆనం చెప్పేశారు. మిగిలిన ముగ్గురు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తమకు మరింత సమయం కావాలని అడిగారు. నిజానికి వీళ్ళు కూడా విచారణకు హాజరయ్యే ఉద్దేశ్యంలో లేరు. స్పీకర్ తమ మీద అనర్హత వేటు వేస్తే అప్పుడు ఏమిచేయాలో ఆలోచించుకోవచ్చన్న ఉద్దేశ్యంలో ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే అసెంబ్లీ కాలపరిమితి అయిపోవచ్చింది. మార్చిలో నోటిఫికేషన్ జారీ అవుతోందని అనుకుంటున్నారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యిందంటే అందరు ఎన్నికల బిజీలో పడిపోతారు. అప్పుడు స్పీకర్ ను పట్టించుకోరు, విచారణను పట్టించుకోరు.





రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది ఎవరో ? గెలిచే వాళ్ళు  గెలుస్తారు లేనివాళ్ళు లేరంతే. ఇప్పటికిప్పుడు ఈ నలుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేసినా ఎవరికీ లాభమూలేదు, నష్టమూలేదు. ఇంతోటిదానికి స్పీకర్ కూడా పదేపదే నోటీసులు ఇవ్వటం, విచారణకు హాజరవ్వమని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న నలుగురు టీడీపీ ఎంఎల్ఏల గోల వేరేవుంది. అదేమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: