ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.నేతలతో ప్రతి ఒక్కటి మాట్లాడారు. ఆర్థిక స్థితిగతులు, రాజకీయ సమీకరణాలపై పవన్ ఆరాతీశారు. ఇక ఆ తర్వాత 4 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్‌, గాజువాకకు సుందరపు సతీష్‌, పెందుర్తిలో పంచకర్ల రమేష్‌ ఇంకా యలమంచిలిలో సుందరపు విజయ్‌ కుమార్‌లను నియమించారు.అధికారికంగా అభ్యర్థులని కాకుండా సమన్వయకర్తలనే ట్యాగ్‌లైన్ తగిలించి 4 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ఆయన ప్రకటించారు. ఇక గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.అంతకుముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి ఇంకా యలమంచిలిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటోంది.అయితే జనసేన ఇన్‌ఛార్జ్‌ల ప్రకటనతో లోకల్ టీడీపీ నేతల్లో ఉలికిపాటు మొదలైంది.


నిజానికి ఆ నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాస్‌.. గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్‌ ఇంకా పెందుర్తి నుంచి సీనియర్ నేత బండారు సత్యనారాయణ, యలమంచిలి నుంచి ప్రగాఢ నాగేశ్వర్‌రావులు సీటు తమకేనన్న ధీమాతో ఉన్నారు. అయితే వీరిలో సీటు త్యాగం చేసేదెవరు..? పట్టుబట్టి సీటు సాధించుకునేదెవరు అనే చర్చ మొదలైంది. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో నాగబాబును బరిలోకి దింపాలని జనసేన పార్టీ భావిస్తోంది. ఇదే స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి చింతకాయల విజయ్‌, బైరా దిలీప్‌ పోటీ చేయాలనుకుంటున్నారు. అధికారికంగా అభ్యర్థుల ప్రకటన చేయకపోయినప్పటికీ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించడంతో టీడీపీ నేతల్లో సీటు టెన్షన్ పట్టుకుంది.సమన్వయకర్తలను ప్రకటించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా టూర్‌కి వెళ్లారు పవన్ కల్యాణ్‌.  21న భీమవరంలో టీడీపీ-జనసేన నేతలతో ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మరోవైపు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయమంటున్నారు పార్టీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: