మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు పెద్ద షాకే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆళ్ళ మళ్ళీ వైసీపీలో చేరారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆర్కే వైసీపీ కండువాను కప్పుకున్నారు. కాంగ్రెస్ ను వదిలేసిన ఆర్కే తిరిగి వైసీపీలో చేరటానికి ఆయన సోదరుడు, రాజ్యసభ ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి సహకరించినట్లు సమాచారం.

దాదాపు నెలరోజుల క్రితమే వైసీపీ సభ్యత్వంతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసిన ఆళ్ళ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అయితే ఎక్కువరోజులు కాంగ్రెస్ లో ఇమడలేకపోయారు. కారణం ఏమిటంటే షర్మిల వైఖరనే అని సమాచారం. పొద్దున లేచినదగ్గర నుండి రాత్రి వరకు షర్మిల ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అయినదానికి కానిదానికి కూడా షర్మిల తన అన్న జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే.

చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన తప్పులకు కూడా జగన్నే టార్గెట్ చేస్తు షర్మిల రెచ్చిపోతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును మాత్రం ఏమీ మాట్లాడటంలేదు. మొహమాటానికి చంద్రబాబును ఏదో రెండుమాటలు అంటున్న షర్మిల తన అన్నపైన మాత్రం ఆకామంత ఎత్తున రెచ్చిపోతున్నారు. చివరకు మాట్లాడటానికి ఏమీ లేకపోతే ఇంటి విషయాలను కూడా రోడ్డున పడేస్తున్నారు. జగన్ మీద బురదచల్లటం కోసం తన తల్లి విజయమ్మ, జగన్ భార్య భారతిని కూడా రోడ్డుకీడుస్తున్నారు.

దాంతో షర్మిల వైఖరి ఆళ్ళకి నచ్చలేదట. జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవటంతోనే ఆళ్ళ మనస్తాపానికి గురై చివరకు లాభంలేదని తేల్చుకుని కాంగ్రెస్ ను వదిలేసినట్లు తెలుస్తోంది. జగన్ పై షర్మిల చేస్తున్న ఆరోపణలకు తెరవెనుక ఎవరున్నారో అన్న విషయం అర్ధమవటంతోనే ఆళ్ళ కాంగ్రెస్ కు రాజీనామా చేసి షర్మిలను వదిలేసి తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: