ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్‌ కిశోర్‌ కామెంట్స్ తో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కామెంట్లపై ఏపీ వైసీపీ నేతలు చాలా తీవ్రంగా స్పందించారు.ఈ నేపధ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు X వేదికగా ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై సెటైర్ వేశారు. 2019 ఎన్నికలపై ప్రీ సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని, ఇప్పడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి రెడీగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు. ' నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు! ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు! ' అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఎక్స్ వేదికగా తెలిపాడు.ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్లపై వైసీపీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. X వేదికగా కీలక కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటలను నమ్మ వద్దని రాష్ట్ర ప్రజలకు ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడుతో నాలుగు గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ కామెంట్స్ చేశారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వర్తమాన రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ అంచనాలు తప్పుతున్నాయని అసలు వాస్తవాలకు పొంతన లేదన్నారు.పీకే చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిశోర్ ప్రజలను ఏమార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన గట్ ఫీలింగ్ అంటూ ఏవో మాట్లాడారని ఎద్దేవా చేశారు.


టీడీపీ-జనసేన ద్వయం చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.ఇక సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రభుత్వాలు మళ్లీ ఎందుకు రావో వివరించాలన్నారు.ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లో ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలన్నారు అమర్నాథ్. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ లానే చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రలో చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు.హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘోర పరాజయం చవి చూస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసే కూటమి అత్యధిక స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రజల సొమ్ముని విచ్చల విడిగా పంచుతూ.. ప్రజల సంక్షేమం చూస్తున్నామనడం వల్ల రాజకీయంగా నష్టపోతున్నారని ఆయన వెల్లడించారు. ఇంకా అంతేగాక ప్యాలెస్‌లో కూర్చొని బటన్లు నొక్కితే ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిశోర్. ఈ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: