తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వరంగల్ జిల్లా ఒక ప్రత్యేకమైన ఆదరణ పొందినటువంటి జిల్లా.  హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీగా పేరుపొందింది.  ఇలాంటి ఉమ్మడి వరంగల్ ఎంపీ స్థానానికి ఈసారి రసవత్తరమైన పోరు జరగబోతుందని తెలుస్తోంది. అయితే ఈ జిల్లా నుంచి  ఇప్పటికే సీతక్క, కొండా సురేఖ లాంటి సీనియర్ మంత్రులు ఉన్నారు.వీరు లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా వరంగల్ జిల్లాలో విజయ దుందుభి మోగించాలని కంకణం కట్టుకున్నారు. ప్రత్యేకమైన వ్యూహాలు రచించి  బీఆర్ఎస్ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కొచ్చారు. 

ఆమెకు వరంగల్ ఎంపీ స్థానంలో పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. దీంతో బీఆర్ఎస్ కు అభ్యర్థి కరువయ్యారు. ఇదే తరుణంలో కావ్యపై పోటీ చేసే బలమైన అభ్యర్థి కోసం కేసీఆర్ వెతుకుతున్నారు. కావ్య ఎస్సి సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి  ఇదే సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థిని బరిలో దించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. అయితే వరంగల్ జిల్లాలో  కడియం శ్రీహరి,  తాటికొండ రాజయ్య తర్వాత  అంతటి పేరు ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు లేరు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో కేవలం తాటికొండ రాజయ్య మాత్రమే వరంగల్ లో కీలకంగా ఉన్నారు. అయితే ఈయనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని జనగామ ఎమ్మెల్యే పళ్లా రాజేశ్వర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట.

 అంతేకాకుండా రాజయ్య కూడా తనకు ఎంపీ టికెట్ కేటాయిస్తే బాగుంటుందని ఆలోచనలో పడ్డారట.  కానీ కేసీఆర్ రాజయ్యకు టికెట్ అంటే ససేమీరా అంటున్నట్టు తెలుస్తోంది.  రాజయ్యను కాస్త పక్కన పెట్టి హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ లేదంటే కేయూ ఉద్యోగి పుల్ల శ్రీను, బోడ డిన్న తదితర పేర్లను పరిశీలిస్తున్నారట. అంతేకాకుండా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అయితే మిగతా బీఆర్ఎస్ నాయకులు మాత్రం రాజయ్యకి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. రాజయ్య అయితేనే కడియం కావ్యకు గట్టి పోటీ ఇచ్చి గెలిచే అవకాశం ఉంటుందని కేసీఆర్ కు కొంత మంది సన్నిహితులు చెబుతున్నా ఆయన కాస్త సంయమనం  పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: