సైబరాబాద్ కట్టింది నేను, టెక్నాలజీకి ఆధ్యుడిని నేను. అభివృద్ధికి అంబాసిడర్ నేను. ఈ మాటలు వినగానే మనకు ఠక్కున చంద్రబాబు గుర్తుకు వస్తారు. మనల్ని ఆ మాటలకు అంతలా అలవాటు చేశారు ఆయన. కానీ ప్రస్తుతం ఈ విధానానికి ఆయన స్వస్తి పలికినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు తన ప్రసంగ శైలిని మార్చారు. తన రూట్ ఛేంజ్ చేశారు. మూస ధోరణులకు స్వస్తి పలికారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాను చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తి లేకుండా స్రైట్ యాడ్ లా చెబుతున్నారు.


చంద్రబాబు ప్రసంగాల్లో మారిన వైఖరి చూసి తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడుతున్నారు. చేసింది చెప్పడం కంటే.. చేయాల్సింది.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తేనే ప్రజలు ఆహ్వానిస్తారని చంద్రబాబు గుర్తించినట్లు ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల ప్రచారంలో ఆయా నియోజకవర్గ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు.


ఫీడ్ బ్యాక్ తెప్పించుకొని  వాటి అనుగుణంగానే తన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్నారు. అక్కడి ఎమ్మెల్యే అక్రమాలు, అన్యాయాలపై నిలదీస్తున్నారు. తాజాగా తణుకు, పాలకొల్లు లో స్థానిక సమస్యలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇది సామాన్యులకు సైతం కనెక్ట్ అయింది. దీంతో ఇక నుంచి స్థానిక అంశాలు, ఎమ్మెల్యేపై విమర్శలకు పరిమితం కావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు కూటమి నేతల గురించి కీలకంగా ప్రస్తావిస్తున్నారు. పవన్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు. పవన్ ప్రజల కోసమే వచ్చారని.. సంపాదించుకునే మార్గాలను సైతం వదులుకున్నారని చెబుతున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని, ప్రధాని మోదీని పొగుడుతూ.. కేంద్రంలో బీజేపీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని పదేపదే పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా తన ప్రసంగ శైలిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఇది ఎన్నికల్లో ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: