•కంచుకోటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని పోటీ
•ఇవే తన చివరి ఎన్నికలు అంటున్న తమ్మినేని
•తమ్మినేనికి ఇబ్బందిగా మారిన ఇండిపెండెంట్ అభ్యర్థి సువ్వారి గాంధీ


శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఒకప్పుడు కంచుకోట. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున 1983లో మొదటిసారి పోటీ చేసి గెలిచారు. ఆ విధంగా ఆయన తెలుగు దేశం నుంచి నాలుగు సార్లు గెలిచారు. 1999 తరువాత తమ్మినేని మళ్లీ గెలిచింది 2019లోనే. అది కూడా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. పార్టీ మారినా కూడా ఆయన ఆ విధంగా ఐదవసారి విజేత అయ్యారు. మంత్రి పదవిని ఆయన ఆశించారు కానీ స్పీకర్ పదవితో జగన్ మోహన్ రెడ్డి గౌరవించారు. ఈసారి టికెట్ దక్కుతుందో లేదో అన్న చర్చ నడచినా తమ్మినేనికే జగన్ మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. దాంతో ఆయన తన రాజకీయ జీవితంలో ఇప్పుడు పదో సారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ పడుతున్నారు.అయితే ఈసారి తనకు చివరి ఎన్నికలు అని ఆయన అంటున్నారు. ఈసారి గెలిస్తే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి సంతృప్తిగా రాజకీయ విరమణ చేయాలని తన వారసుడిని తయారు చేసుకోవాలని తమ్మినేని కోరుకుంటున్నారు. అయితే ఆముదాలవలసలో తమ్మినేనికి సొంత మేనల్లుడే అయిన కూన రవికుమార్ తెలుగు దేశం నుంచి ప్రధాన ప్రత్యర్థి గా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యన నాలుగవ సారి పోటీగా సాగుతోంది.


ఆముదాలవలసలో తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉంది. వైసీపీ పటిష్టంగా ఉండేది కానీ అందులో నుంచి తమ్మినేని అభ్యర్ధిత్వం పట్ల అసంతృప్తితో వర్గాలుగా విడిపోవడం జరిగింది. కొంతమంది సైలెంట్ గా ఉంటే సువ్వారి గాంధీ అనే నేత పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీకి దిగిపోయారు.ఆయన వల్ల వైసీపీకి ఓట్ల నష్టం చాలా భారీగా జరుగుతుందని కలవరపడుతున్నారు. తమ్మినేని తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి వర్గాలను దారికి తెచ్చుకోలేకపోయారని అంటున్నారు. వైసీపీని ఆకట్టుకుని గ్రామ స్థాయి నాయకులను తెలుగుదేశం పార్టీ సైకిలెక్కించేస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న సువ్వారి గాంధీని పోటీ నుంచి విరమించుకునేలా చేస్తే తమ్మినేని విజయావకాశాలు ఖచ్చితంగా ఉంటాయని అంటున్నారు.అలా కాకపోతే ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. అయితే ఈసారి ఎన్నికల ప్రత్యేకంగా సాగుతుందని సంక్షేమ పధకాల లబ్దిదారులు అంతా వైసీపీకి ఓట్లు వేస్తారని అలా తమ ఓటు బ్యాంక్ 2019 కంటే పెరిగిందని తమ్మినేని వర్గానికి చెందిన వారు చెబుతున్నారు.మొత్తానికి ఈ ఆముదాలవలస మాత్రం టీడీపీ వైసీపీల మధ్య గట్టి పోటీగా ఉండే సీటు గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: