కడప జిల్లాలో వైఎస్ ఆర్ ఫ్యామిలీ మధ్య పొలిటికల్ వార్ రచ్చకు దారి తీస్తోంది. సీఎం జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అక్కా చెల్లెల్లు ఇద్దరు జట్టు కట్టి.. అన్నదమ్ములైన సీఎం జగన్, అవినాష్‌రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.


వైఎస్ వివేకా హత్య కేసులో ఇరువురు అక్కా చెల్లెళ్లు అవినాశ్ రెడ్డి కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అవినాశ్ కు సీఎం జగన్ మళ్లీ టికెట్ ఇచ్చినందుకు తాను కడప లోక్ సభ నుంచి బరిలో నిల్చొన్నట్లు షర్మిళ ప్రకటించారు. అంతేకాదు అవినాశ్ రెడ్డే హంతకుడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కొంత కాలంగా సునీతా తో కలసి ఆద్యంతం వివేకా హత్యను ప్రస్తావిస్తూ ఆమె కడపలో ప్రచారం చేస్తున్నారు.


కొంగు చాచి మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం అంటూ షర్మిళ, సునీత ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ వార్ లోకి వైఎస్ కుటుంబానికి చెందిన మేనేత్త విమలమ్మ ఎంటర్ అయ్యారు. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ నోరు మూసుకోవాలని హెచ్చరించారు. ఇద్దరూ నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. వైఎస్ కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అన్యాయంగా మాట్లాడతారా అంటూ అక్కాచెల్లెళ్లని నిలదీశారు.


తాను కూడా వైఎస్ ఇంటి ఆడపడుచుగా మాట్లాడుతున్నానని.. వైఎస్ అవినాశ్ రెడ్డి హత్య చేస్తుంటే మీ ఇద్దరు చూశారా అని ప్రశ్నించారు. దివంగత వైఎస్ వివేకాను చంపిన వారు దర్జాగా బయట తిరుగుతున్నారని విమలమ్మ ఆరోపించారు. వైఎస్ కుటుంబంలోని ఇద్దరూ షర్మిళ, సునీత ఇలా తయారవ్వడం చూసి బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకొని సీఎం జగన్ ను ఇందులోకి లాగుతున్నారన్నారు. అంతేకాదు వైఎస్ కుటుంబ సభ్యులెవరూ కూడా మీకు మద్దతు ఇవ్వరు అని గుర్తుపెట్టుకోమని విమలమ్మ హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: