ప్రస్తుతం ఏపీలో ఉమ్మడిగా పోటీ చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన రాజకీయ విధానాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయి. పోలింగ్ తేదీ మే 13 సమీపిస్తోంది. సరిగ్గా పోలింగ్ తేదీకి నెల రోజులు కూడా లేదు. ఈ సమయంలో ప్రజలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరాల జల్లులు కురిపించేస్తున్నారు. ఎడాపెడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. మరో వైపు కూటమిలో కీలకమైన ప్రధాని మోడీ మాత్రం తాము ఉచితాలకు వ్యతిరేకమని చెబుతున్నారు. ఒకే గూటికి చెందిన ఈ రెండు పార్టీల నుంచి ఉచితాలపై భిన్న స్వరాలు వస్తుండడం గమనార్హం. ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఈ పార్టీలు రాష్ట్రంలో మొదలు పెట్టేశాయి. అయితే ఏపీలోని ఈ కూటమి పార్టీలు ఉమ్మడిగా మేనిఫెస్టోను ప్రకటిస్తాయా? లేక విడివిడిగా ముందుకెళ్తాయా అనేదానిపై ప్రస్తుతం స్పష్టత కొరవడింది.

గత పదేళ్ల హయాంలో ప్రధానిగా మోడీ కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించారు. భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలనేది తన లక్ష్యమని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేర్చారు. త్వరలో మూడో స్థానానికి భారత్ చేరడం ఖాయమని ఆయన పేర్కొంటున్నారు. అయితే దేశాభివృద్ధికి ఉచితాలు విఘాతమనే భావనలో బీజేపీ ఉంది. ఆ పార్టీ విధానాలు సైతం కేవలం దేశాభివృద్ధి వైపు ఎక్కువగా ఉన్నాయి. సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధిపై బీజేపీ దృష్టి పెట్టింది. దీంతో 2047 నాటికి ప్రపంచంలోనే భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో కనిపిస్తోంది. ఈ తరుణంలో ఏపీలో ఆ పార్టీ ఎలాంటి విధానాలు అవలంబించనుందో రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టడం లేదు. ఆ పార్టీ ప్రస్తుతం టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ సమయంలో కూటమిలోని జనసేన, బీజేపీకి సమాచారం ఉందో లేదో తెలియదు కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. అయితే ఉచితాల పట్ల విముఖత చూపే బీజేపీ తమ మిత్రపక్షం టీడీపీకి ఎక్కడా అడ్డు చెప్పడం లేదు. అలా అని ఆ పార్టీని సమర్ధించడం కూడా లేదు. మినీ మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్ హామీలను ఆయన ఇప్పటికే ఇచ్చేశారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోను త్వరలో ప్రకటించనున్నారు. వీటి విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: