తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ప్రజల మద్దతు కోసం హామీలు, నిలదీతలు, విమర్శలతో నేతలు తమ నోటికి పని చెబుతున్నారు. ఇక రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. వాటిలో రైతు రుణమాఫీ కూడా ఒకటి. రూ.2 లక్షల రుణ మాఫీ రైతులకు చేస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటింది. దీంతో హామీలను అమలు చేశాకే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు ప్రస్తుత కష్టకాలంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న హరీష్ రావు అధికార పక్షంపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం అమలు చేసే పథకాలు, హామీలు ఈసీ నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోగా అమలు చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఆ వెంటనే దీనిపై బీఆర్ఎస్ నుంచి కౌంటర్‌గా మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్‌కు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు సవాల్‌గా మారాయి. దీంతో ప్రభుత్వంపై అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా హరీష్ రావు కాంగ్రెస్‌పై నిత్యం పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాల్సిందేనని ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. ఇక ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాక హరీష్ రావు సంచలన ట్వీట్ చేశారు. అందులో 'పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. డిసెంబర్ 9న ఆడే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలి' అని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఎకరానికి రూ.15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని, మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమయిందని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: