దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది. ఈ తరుణంలో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభావం ఏపీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది కొత్త కాదు.


2019 ఎన్నికల్లో తెలంగాణ అంశాలు దోహదపడ్డాయి. అక్కడి నుంచి కేసీఆర్ సహకారం అందడంతో జగన్ విజయవంతం అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయారు. రేవంత్ రెడ్డి  గద్దెనెక్కారు. చంద్రబాబు శిష్యుడు కావడంతో తెలంగాణ నుంచి చంద్రబాబుకి సహకారం అందుతుందని అంతా భావిస్తున్నారు. కానీ రేవంత్ ఇచ్చిన హామీల ప్రభావం చంద్రబాబుపై పడుతోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దానికి కారణం సూపర్ సిక్స్ పథకాలు. అవే పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని ఆరు గ్యారంటీలను ప్రకటించింది.


రైతు బంధు, ధాన్యం సేకరణ, మహిళలకు రూ.2500 నగదు ఈ పథకాల్లో కీలక మైనవి. అయితే తెలంగాణలో రేవంత్ వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా వీటిని అమలు చేయలేదు. కనీసం వీటిని ప్రారంభించలేదు. దీంతో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రకటించిన విధంగానే చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ పథకాలను నమ్ముకున్నారు. వీటిని అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెబుతున్నారు.


అయితే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి వీటిని అమలు చేయడంలో విఫలం కావడంతో చంద్రబాబుపై అప నమ్మకం ఏర్పడుతోంది. అందుకే ఈ సూపర్ సిక్స్ హామీలు ప్రజల్లోకి అంతగా వెళ్లడం లేదు. ఒకవేళ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వీటిని అమలు చేసి ఉంటే.. చంద్రబాబు కూడా చేస్తారు అనే నమ్మకం ఏర్పడేది. పైగా ఏపీ కంటే తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఇక్కడే అమలు కాకుంటే.. ఇక ఏపీలో ఎలా చేస్తారు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నారు అనేది సుస్పష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: