తెలంగాణ సామాజిక సమస్యల్లో  గల్ఫ్ కార్మికుల సమస్య అత్యంత ప్రధానమైనది. స్వరాష్ట్రం  సిద్ధించిన తర్వాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంతా భావించారు. ఉద్యమ సమయం, ఎన్నికల సమయంలో గల్ఫ్ బాధితుల గురించి హామీలు ఇవ్వడం వాటిని మరిచిపోవడం నాయకులకు పరిపాటిగా మారింది. ఒకటి రెండు సంఘటనల్లో హడావుడి చేసి.. ప్రచార ఆర్భాటానికి వాడుకున్నారు తప్ప ఇప్పటికీ గల్ఫ్  బాధితులకు శాశ్వత పరిష్కారం చూపలేదు.


తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన  చేశారు.  హైదరాబాద్ లోని డెక్కన్ హోటల్లో గల్ఫ్ కార్మిక సంఘాలు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే గల్ఫ్ కార్మికులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికీ రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు.


గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి వారి సలహాలతోనే తుది రూపు ఇస్తామని ప్రకటించారు. ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు తీసుకుంటామని వారికి చట్టబద్ధత ఉండేలా చూస్తామని స్సష్టం చేశారు. కార్మికుడు మరణించిన క్రమంలో ఆ కుటుంబానికి రూ. 5లక్షల బీమాను అందజేస్తామన్నారు. సెప్టెంబరు 17లోగా గల్ఫ్ కార్మికుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


వాస్తవానికి ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉంటుంటారు. జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ నుంచి అత్యధికంగా ఉంటారు. వీరిలో పలువురు బతుకు దెరువు కోసం.. పొట్ట చేత పట్టుకొని విదేశాల బాట పడుతుంటారు. వీరిలో కొందరు ఏజెంట్ల మోసాలకు బలవుతూ ఉంటారు. ఎన్నికల సమయంలో వీరి బాధలు పార్టీలకు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు కూడా లోక్ సభ ఉన్నాయనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ప్రమాద బీమా సాధ్యాసాధ్యాలపై సీఎం సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నిస్తున్నారు.  వారికి మన రాష్ట్రంలో ఉపాధి చూపించి వలసలు ఆపాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: