మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ నేతగా 40 సంవత్సరాల అనుభవం, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉంది. అయితే ఇంత అనుభవం ఉన్న నేత మాట్లాడే సమయంలో ప్రతి మాట ప్రజలు నమ్మేలా ఉండాలి. కృష్ణా జిల్లా పెడన బహిరంగ సభలో మా వద్ద డబ్బు లేదు కానీ నిజాయితీ ఉంది అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి.
 
చంద్రబాబు మాట్లాడుతూ లిక్కర్, ఇసుక, భూకబ్జాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనాలని జగన్ చూస్తున్నారని జగన్ వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది వైసీపీ నేతలు బయటకు వచ్చేశారని ఐదు సంవత్సరాలు ఎంపీగా పని చేసినా ప్రజలకు ఏం చేయలేకపోయాననే భావనతో బాలశౌరి బయటికొచ్చి జనసేనలో చేరారని  కామెంట్లు చేశారు. ప్రజలను గెలిపించడానికే మూడు పార్టీలు కలిశాయని ఆయన చెప్పుకొచ్చారు.
 
సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమి ఎజెండా అని మా వద్ద డబ్బు లేదు కానీ నిజాయితీ ఉందని తెలిపారు. శ్రీరాముడు రావణాసుర వధ చేశారని ఏపీ ప్రజలు జగనాసుర వధ చేయాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ కు బటన్ నొక్కడం తప్ప ఏమీ తెలియదని ఇంట్లో ఉండే ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
మేము ముగ్గురం కలిసొస్తుంటే జగన్ శవాలతో వస్తున్నాడని వైసీపీవి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలని బాబు అన్నారు. జగన్ గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మట్లేదని ఆయన కామెంట్లు చేశారు. జగన్ పై విమర్శలు బాగానే ఉన్నాయి కానీ చంద్రబాబు దగ్గర డబ్బు లేకపోతే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివని సామాన్య ప్రజల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు మరీ హద్దులు దాటకుండా విమర్శలు చేస్తుండగా పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ పై విమర్శల విషయంలో ఘాటు పెంచుతున్నారు. జగన్ కు రాజకీయాలు అనవసరం అని పవన్ చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: