ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గం తరపున పోటీ చేస్తున్న బుట్టా రేణుక పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎమ్మిగనూరు బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ బుట్టారేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే నిన్న ఉదయం బుట్టా రేణుక నామినేషన్ దాఖలు చేయగా ఆమె ఆస్తుల లెక్క తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.
 
బుట్టా రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేర్ల మీద ఉన్న ఆస్తుల విలువ 161 కోట్ల 21 లక్షల రూపాయలు కావడం గమనార్హం. ఈ ఆస్తులలో చరాస్థులు 142 కోట్ల 46 లక్షలు కాగా స్థిరాస్థులు 18 కోట్ల 75 లక్షల రూపాయలు అని తెలుస్తోంది. బుట్టా రేణుక దంపతులకు 7 కోట్ల 82 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. 2014 సంవత్సరంలో బుట్టా రేణుక దంపతుల ఆస్తుల విలువ 242 కోట్ల 60 లక్షల రూపాయలు కాగా పదేళ్లలో ఆమె ఆస్తుల విలువ 80 కోట్ల రూపాయలు తగ్గడం గమనార్హం.
 
హోటళ్లు, విద్యా సంస్థలు, ఆటో మొబైల్స్ బిజినెస్ లలో బుట్టా రేణుక దంపతులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సొంతంగా కన్వెన్షన్ హాల్ ను కలిగి ఉండటంతో పాటు బుట్టా దంపతులు పలు కంపెనీల వాహనాల డీలర్ షిప్ ను కలిగి ఉన్నారు. రేణుక పేరిట ఉన్న బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాల విలువ రెండున్నర కోట్ల రూపాయలు కాగా ఆమె భర్త పేరిట 435 గ్రాముల బంగారు నగలు ఉన్నాయి.
 
బుట్టా రేణుకపై ఉన్న కేసుల విషయానికి వస్తే ఐటీ రూల్స్ ఉల్లంఘించినందుకు బుట్టా రేణుకపై హైదరాబాద్ లోని ఆర్థిక నేరాల న్యాయస్థానంలో మూడు కేసులు నడుస్తుండగా కర్నూలులో ఒక కేసు ఉందని తెలుస్తోంది. బుట్టా రేణుక ఆస్తుల విలువ తెలిసి వందల కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్న ఈ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని జగన్ ఎందుకు చెప్పారో అస్సలు అర్థం కావడం లేదని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: