కర్నూలు జిల్లా లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి బీవై రామయ్య పోటీ చేస్తుండగా సర్వే ఫలితాలలో కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడవుతోంది. అయితే నాగరాజు మాత్రం కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతుందని తాను ఎంపీగా కచ్చితంగా విజయం సాధిస్తానని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
 
కెమిస్ట్రీ లెక్చరర్ గా పని చేసిన నాగరాజు తర్వాత రోజుల్లో రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారు. ఎంపీటీసీగా నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టానని అధికార పార్టీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం సాధించానని ఆయన చెప్పుకొచ్చారు. కురువ సామాజికవర్గానికి చెందిన నాగరాజు కురువ, యాదవ సామాజిక వర్గాల ఓటర్లపై ఆశలు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపుగా 2 లక్షల మంది కురువ, యాదవ ఓటర్లు ఉన్నారు.
 
వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బీవై రామయ్య వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో 5 లక్షల మంది వాల్మీకి ఓటర్లు ఉండటంతో వైసీపీ సైతం సునాయాసంగా కర్నూలు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందనే నమ్మకంతో ఉంది. బస్తిపాటి నాగరాజును స్థానికంగా పంచలింగాల నాగరాజు అని పిలుస్తారు. అంచెలంచెలుగా ఎదిగిన నాగరాజు ఎంపీగా గెలిపిస్తే కర్నూలును అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతున్నారు.
 
కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి కొత్త వ్యక్తులు పోటీ చేస్తుండటంతో ఎవరు సత్తా చాటుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. సేవా గుణంతోనే రాజకీయాల్లోకి వచ్చానని నాగరాజు కామెంట్లు చేస్తుండగా రైతుబిడ్డ అయిన నాగరాజు ఓటర్ల మనస్సును గెలుచుకుంటారో లేదో చూడాలి. 2000 సంవత్సరం నుంచి టీడీపీలో కార్యకర్తగా ఉన్న నాగరాజు బీసీల మద్దతు తనకే ఉంటుందని నమ్ముతున్నారు. కర్నూలులో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందనే చంద్రబాబు నమ్మకాన్ని నాగరాజు నిజం చేస్తారో లేదో చూడాల్సి ఉంది.
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: