ఏపీ సీఎం జ‌గ‌న్ .. తాజాగా ఎన్నిక‌ల పోలింగ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తామే తిరిగి అధికారంలోకి వ‌స్తున్నామ‌ని.. గ‌త 2019లో వ‌చ్చిన సీట్ల కంటే కూడా.. ఇప్పుడు ఎక్కువ‌గా తెచ్చుకుంటున్నామ‌ని.. 22 ఎంపీ స‌హా 151 కి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం త‌మ‌దేన‌ని చెప్పారు. అంతేకాదు..జూన్ 4న వ‌చ్చే ఏపీ ఫ‌లితంతో దేశం మొత్తం షాక్‌కు గుర‌వుతుంద‌ని.. ఎవ‌రూ ఊహించని ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని కూడా ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిషోర్ అంచ‌నాలు కూడా త‌ప్పుతాయ‌ని చెప్పారు.


క‌ట్ చేస్తే.. సీఎం జ‌గ‌న్‌కు ఇంత ధీమా ఎక్క‌డ నుంచి వ‌చ్చింది? ఆయ‌న ఎలా చెప్ప‌గ‌లుగుతున్నారు? అనేది మిలియ‌న్‌డాల‌ర్ల ప్ర‌శ్న‌. అంతేకాదు.. రాజ‌కీయ ఉద్ధండుడు, సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు 14 ఏళ్ల ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు కూడా ఇంత ధీమాగా అయితే.. చెప్ప‌లేక పోతున్నారు. ఎన్డీయే గెలుస్తుం ద‌ని అంటున్నారు త‌ప్ప‌.. ఇంత ధీమా అయితే.. క‌నిపించ‌డం లేదు. బాబుతో పోల్చుకుంటే.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు జ‌నంలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.


మ‌రి జ‌గ‌న్ లో నెల‌కొన్న ధీమాకు కార‌ణం ఏంటి? అనే విష‌యాలు ప‌రిశీలిస్తే.. ఏం చెప్పినా.. జ‌గ‌న్‌చాలా లోతుగా ఆలోచించి చెబుతార‌ని క‌రోనా స‌మ‌యంలోనే రుజువైంది. అప్ప‌ట్లో ఆయ‌న పారాసిట్మాల్ టాబ్లెట్ వేసుకుని.. కొన్నిరోజులు ఐసోలేట్ అయితే.. అదే త‌గ్గిపోతుంద‌ని అన్నారు. అప్ప‌ట్లో ఆయ‌న‌ను అంద‌రూ చీద‌రించుకున్నారు. వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. రోజులు గ‌డిచిన త‌ర్వాత‌.. మాత్రం ఇదే నిజ‌మైంది. మెలితిరిగిన వైద్యులు కూడా.. ఇదే ఫార్ములా చెప్పారు. తెలంగాణ అప్ప‌టి సీఎం కేసీఆర్ కూడా ఇదే ఫార్ములాను చెప్పుకొచ్చారు. ఇది నిజ‌మైంది కూడా.


క‌ట్‌చేస్తే.. ఇప్పుడు కూడా.. జ‌గ‌న్ చాలా అధ్య‌య‌నం చేసే త‌న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డించార‌నేది మేధావుల మాట‌. ఎలా అంటే.. ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ మాట్లాడ‌లేదు. రెండు రోజుల పాటు మౌనంగానే ఉన్నారు. ఈ లోగా.. అన్ని లెక్క‌లు చూసుకుని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏపీలో జ‌రిగిన పోలింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. జిల్లాలు, మండ‌లాలు, నియోజ‌క‌వ‌ర్గాలు, ప‌ల్లెలు, గ్రామాలు, ప‌ట్ట‌ణాలు.. ఇలా.. అన్ని ప్రాంతాల్లోనూ ఎలాంటి పోలింగ్ న‌మోదైందో లెక్క‌ల‌తో స‌హా వివ‌రించింది.


అంతేకాదు.. పురుషులు ఎంత మంది ఓటేశారు. మ‌హిళ‌లు ఎంత మంది ఓటేశారు. వీరిలో ఎవ‌రు ఎక్కువ‌గా వేశారు. ఎవ‌రు త‌క్కువ వేశారు.. కొత్త‌ ఓట‌ర్లు ఎంత మంది ఉన్నారు. వంటి అన్ని ర‌కాల వివ‌రాల‌ను మైక్రో లెవిల్లో వివ‌రించింది. వీటిని ప‌రిశీలిస్తే.. 4 ల‌క్ష‌ల 28 వేల మంది మ‌హిళ‌లు అద‌నంగా ఓటేశారు.(పురుషుల‌తో పోల్చుకుంటే.). అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 80-90 శాతం మ‌ధ్య‌లో పోలింగ్ జ‌రిగింది. మండ‌లాల‌క‌న్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ‌గా ప‌డ్డాయి.


ఇవ‌న్నీ ప‌రిశీలించి.. ఆయా మండ‌లాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ఎంత మందికి అందుతున్నాయ‌నే లెక్క‌లు తీసి.. సీఎం జ‌గ‌న్ అంచ‌నా వేసుకున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇది ఖ‌చ్చిత‌మైన లెక్క అవుతుంద‌ని చెబుతున్నారు. అందుకే అంత ధీమాగా జ‌గ‌న్ వెల్ల‌డించార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: