ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎంట్రీతో ఊహించని మలుపులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడిన షర్మిల ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున బాధ్యతలు స్వీకరించి వైసీపీ ఓటమి కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిపై షర్మిల చంద్రబాబు, పవన్ కంటే ఒకింత ఘాటుగానే విమర్శలు చేశారనే సంగతి తెలిసిందే.
 
అయితే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి షర్మిల వివేకా హత్య కేసును ప్రధానాస్త్రంగా మార్చుకున్నారు. పదేపదే వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ సానుభూతి ఓట్లను పొందాలని ఆమె ప్రయత్నం చేశారు. అయితే వివేకా హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సుప్రీంలో తీర్పు తమకు అనుకూలంగా రావడంతో షర్మిల ఈ తీర్పు గురించి స్పందించారు.
 
"దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకా హత్య విషయంలో సుప్రీం స్టే ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్చపై రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిన్న ప్రూవ్ అయింది. చిట్టచివరిగా విజయం, నిజం న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం" అంటూ షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోకి రాకముందు ఎందుకు విమర్శలు చేయలేదంటూ వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
 
రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల ఎంత దూరమైనా వెళ్తారా? కుటుంబంలో విబేధాలు ఉంటే రాజకీయంగా కక్ష సాధించాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ ఒక్క మాట అంటే కన్నీళ్లు పెట్టుకునే షర్మిల జగన్ ను మాత్రం ఎన్ని మాటలైనా అనవచ్చా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలతో షర్మిలకు వాస్తవాలు బోధపడతాయని వైసీపీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఈ ఎన్నికల్లో మరోమారు విజయం సాధిస్తామని కాన్ఫిడెన్స్ తో ఉంది. టీడీపీ అనుకూల నేతల్లో మాత్రం ఆ స్థాయిలో కాన్ఫిడెన్స్ లేకపోవడం గమనార్హం.

 




మరింత సమాచారం తెలుసుకోండి: