ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎంను ధ్వంసం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి అడుగు పెట్టిన పిన్నెల్లి నేరుగా ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లి ఏదో శత్రువుని నేలకేసి కొట్టినట్టు చాలా కోపంగా విసిరి కొట్టారు. కాగా ఈ దృశ్యాలు సమీప సీసీ ఫుటేజ్ లో లభ్యమవ్వగా ఈ బండారం బయటపడింది. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి రౌడీయిజం దీనిద్వారా ఋజువయింది. ఎన్నికల కమిషన్ ఈ విషయమై సీరియస్ కాగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇక ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడంలో స్థానికి పోలీసు శాఖవారు బిజీ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై క్రిమినల్ కేసునమోదు చేయాలని ఆదేశించిన సీఈసీ ఈ మేరకు రాష్ట్ర సీఈఓకు, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయనని ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆయన హైదరాబాద్ కు వెళ్లి తలదాచుకోగా పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనకోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. మాచర్లలో ఆయనను పోలింగ్ రోజు గృహనిర్భంధం చేసినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్ చేరుకోవడంపైన కూడా ఈసీ అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.

అయన మాత్రమే కాకుండా ఆయన సోదరుడిని కూడా అదుపులోకి తీసుకోనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మళ్లీ పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో అటువంటి అల్లర్లు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు బలగాలు చెబుతున్నాయి. మరో వైపు పల్నాడు జిల్లా అంతటా 144వ సెక్షన్ అమలులో ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. జూన్ 5వ తేదీ వరకూ 144వ సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇప్పటకే ప్రకటించారు. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే తలెత్తే పరిణామాలపై కూడా ఊహించి అందుకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: