- పసుపు పార్టీని కాపాడేదెవరు.?
- లోకేష్ కు అంత సీన్ లేదా.?
- పవన్ కళ్యాణే పార్టీకి దిక్కా!


రాజకీయాలనేవి ఎవరికీ శాశ్వతం కాదు. ఒకసారి గెలిచిన అభ్యర్థులు   మరోసారి ఓడిపోతారు. ఎన్టీఆర్ లాంటి పెద్ద నాయకుడికే ఓటమి తప్పలేదు.ఇక మిగతా వాళ్ల గురించి మనం చెప్పనక్కర్లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ ను కూడా  ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అలాంటి ప్రజల తీర్పును గౌరవించాలి తప్ప తిరస్కరించకూడదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా  మే 13న ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ ను టిడిపి, వైసిపి చావో రేవో అన్నట్టుగా తీసుకున్నాయి.  టిడిపి ఈసారి ఓడిపోతే మాత్రం ఇక బ్రతుకు లేదు జీవుడా అనే విధంగా హోరాహోరీ పోరు చేశాయి. ఈ సందర్భంలో  టిడిపి ఓడిపోతే వారికి భవిష్యత్తు ఉంటుందా. ఆ పార్టీకి దిక్కెవరు అనే వివరాలు చూద్దాం..

 తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన అన్న ఎన్టీఆర్ స్థాపించారు. పార్టీ తీసుకువచ్చిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. అయినా ఎన్టీఆర్ తక్కువ సమయంలో పార్టీని అధికారంలోకి  తీసుకురావడంతో  జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయనకు భయపడ్డారని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ కొన్ని పర్యాయాలు ఏకధాటిగా పాలన చేశారు.

 ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు:
 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎన్నో  ఎన్నికలను చూశారు. ఆయన రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి దాదాపుగా నాలుగు దశాబ్దాలు పూర్తయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రికార్డు క్రియేట్ చేసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించాడు. అలాంటి చంద్రబాబు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే ఇక చంద్రబాబును బీట్ చేసేవారు ఉండరు. తెలుగుదేశం పార్టీకి కూడా  భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం  ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్ పాలన తర్వాత పార్టీ చంద్రబాబు  చేతిలోకి  వచ్చింది.  1999 ఎన్నికల్లో చంద్రబాబును టిడిపి నాయకులే ఓడగోడతారని అన్న ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని అందరూ భావించారు.కానీ చంద్రబాబు ఆ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు. ఇక 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి  గెలిచిన తర్వాత 2009 వరకు ఒక రకమైన రాజకీయాలు నడిచాయి. 2009 వైయస్సార్ మరణం తర్వాత 2014 వరకు మరో రకమైన రాజకీయాలు నడిచాయి.


 ఈ టైం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చిత నెలకొంది.  ఓ పక్క తెలంగాణ ఉద్యమం, మరో పక్క కాంగ్రెస్ లో రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఈ టైం లోనే   తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాయి. ఇక విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇలా కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత చెరొకసారి పాలించారు. కానీ ఈ ఎన్నికలే చాలా  కీలకం అయ్యాయి. చంద్రబాబు ఓడిపోతే  ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే వయసు మీద పడింది. పూర్వకాలంలో లాగా రాష్ట్రంలో ప్రజల నాడి పట్టుకుని నాయకులందరినీ  కూడగట్టి రాజకీయాలు చేసే శక్తి నశించింది. ఆయన వారసుడిగా లోకేష్ ఎంట్రీ ఇస్తారంటే ఆయనకు అంత స్టామినా లేదనే భావన సొంత టిడిపి నాయకుల్లోనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఇప్పటికే దూరమయ్యారు.  బాలకృష్ణ రెండు పడవల మీద కాలు వేసి  ప్రయాణం చేసినట్టు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీని కాపాడేవారు కరువయ్యారు అని చెప్పవచ్చు. ఒకవేళ టిడిపి ఓడిపోతే మాత్రం ఇక నెక్స్ట్ వైసీపీని బీట్ చేసేది పవన్ కళ్యాణ్ అనే  మాట కూడా వినిపిస్తోంది. టిడిపి ఓటమి పాలైతే చాలా మంది టిడిపి నేతలు  జనసేన పార్టీలోకి జంపవుతారు.  ఆ తర్వాత ఎన్నికల్లో జనసేనకు  మరియు వైసీపీకి మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఏ పార్టీ భవిష్యత్తు ఏంటనేది జూన్ 4వ తేదీనే బయటకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: