వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే చిన్న స్థాయి నేరస్తులనుంచి పై స్థాయి వరకూ నేర మనస్తత్వం ఉన్న వారిని ప్రోత్సహించడం ఆ పార్టీ స్ట్రాటజీగా మారిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. విజయవాడలో జేబుదొంగల కుటుంబానికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చి గెలిపించడం, ఆ తర్వాత కూడా ఆ కుటుంబం తమ వృత్తి మానుకోక టీడీపీ సభల్లో జేబులు కొడుతూ పట్టుబడటం ప్రజల మదిలో ఇంకా మిగిలే ఉంది. ఈ తరహా సంఘటనలు చూసినప్పుడల్లా “వైసీపీ స్ట్రాటజీ ఇదేనేమో” అనే టాక్ మరింత బలపడింది. అలాంటి పద్ధతిలోనే ఇప్పుడు అందరి నోళ్లలో వినిపిస్తున్న పేరు నెల్లూరు లేడీ డాన్ అరుణ.


అరుణ ఎదుగుదల – దిశ యాప్ నుంచి డాన్ అవతారం .. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరుణ ‘దిశ యాప్ ప్రచారకురాలు’గా కొత్త అవతారం ఎత్తింది. అయితే ఆ ప్రచారం కంటే, తన దందాలు, సెటిల్మెంట్లతోనే ఆమె పేరు తెచ్చుకుంది. పార్టీ పెద్దలు, పోలీసులు – అందరికీ తనతో చనువు పెంచుకుంది. పోలీసు ఉన్నతాధికారులతో కూడా బలమైన లింకులు పెంచుకుని ఏ పని అయినా సులభంగా చేసిపెట్టే స్థాయికి ఎదిగింది. ఆమె దూకుడు ఎంతవరకూ వెళ్లిందంటే, జైలులో ఉన్న ఖైదీని ఆసుపత్రికి పిలిపించుకుని, కాపలా పోలీసుల కళ్ల ముందే అతడితో సన్నిహితంగా గడపడం వరకు వెళ్ళిపోయింది. ఆ వీడియోలు బయటకు రావడంతో రాష్ట్రం అంతా ఒక్కసారిగా షాక్‌కు గురైంది.



మాజీ మంత్రి కుమారుడి ప్రమేయం ..  అరుణ కథ‌లో మరో సెన్సేషన్ – ఒక వైసీపీ మాజీ మంత్రి కుమారుడి పేరు వినిపించడం. ఇద్దరు ఐపీఎస్ అధికారులు “అసలు సాధ్యం కాదు” అని చెప్పినా, నేరుగా హోంశాఖ కార్యాలయం నుంచి పెరోల్ జీవోను రిలీజ్ చేయించుకోవడం వెనుక భారీ లాబీయింగ్ జరిగిందని తెలుస్తోంది. సచివాలయ వర్గాల టాక్ ప్రకారం ఆ జాబితాలో మాజీ మంత్రి కుమారుడి ప్రమేయమే ఎక్కువ. డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారాయన్నది క్లియర్. అరుణ స్వయంగా “నేను పదకొండు లక్షలు ఇచ్చాను” అని చెబుతోందన్న సమాచారం మరింత సంచలనం రేపుతోంది. రౌడీలతో లింకులు – సెటిల్మెంట్ల కింగ్‌పిన్ .. ఒకప్పుడు చిన్న బొటిక్ నడుపుకుంటూ జీవనాన్ని సాగించిన అరుణ, తర్వాత రౌడీలతో పరిచయాలు పెంచుకుని సెటిల్మెంట్ల ప్రపంచంలోకి దూకేసింది. ఖచ్చితంగా పనులు సెట్ చేసే ‘శ్రీకాంత్’ అనే రౌడీతో కలిసి పనిచేస్తూ, తనకిష్టంలేని వారిని భయపెట్టి, కూల్చి, దందాలు సెట్ చేయడంలో దిట్టగా మారింది. నెల్లూరులో ఒక రేంజ్ సృష్టించింది.



అధికారులు ఆరా .. ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో అధికారులు ఈ వ్యవహారాన్ని పూర్తిగా రివ్యూ చేస్తున్నారు. అరుణ పాత దందాలు, సెటిల్మెంట్లు, ఆమెను కాపాడిన అధికారుల జాబితా అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక బాగోతం బహిర్గతమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టమవుతోంది. మొత్తానికి – జేబుదొంగల కుటుంబం నుంచి నెల్లూరు లేడీ డాన్ వరకూ, నేరస్తులను రాజకీయంగా ప్రోత్సహించడమే వైసీపీ అసలు స్ట్రాటజీ అన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఈసారి మాత్రం అరుణకీ, ఆమె వెనక ఉన్న పెద్దలకీ తప్పించుకోవడం కష్టమేనని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దటీజ్ ది లేడీ డాన్ స్టోరీ ఆఫ్ నెల్లూరు!

మరింత సమాచారం తెలుసుకోండి: