\ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీ మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బార్ల నిర్వహణకు సంబంధించిన కొత్త విధానాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు ప్ర‌భుత్వం మద్యం రంగంలో సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో బార్ల సంఖ్యను పెంచడం, పెట్టుబడి భారం తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి రాష్ట్రంలో రెండు లక్షలకుపైగా బార్లు ఉన్నా కొత్త పాలసీతో మరో లక్ష బార్లు పెరిగే అవకాశం ఉంది. కొత్త విధానంలో ముఖ్యమైన మార్పు డిపాజిట్ సొమ్ము తగ్గింపే. ఇంతవరకు ఉన్న అధిక మొత్తంతో పోలిస్తే, కొత్తగా రంగంలోకి అడుగుపెట్టేవారికి ఇది ఉపశమనంగా ఉంటుందని భావిస్తున్నారు. బార్ యజమానులు, కొత్త లైసెన్స్ కోసం ప్రయత్నించే వారికి ఇది పెద్ద వరమని కొంతమంది భావించినా, మరోవైపు ఒక కొత్త సమస్య తలెత్తింది.


ప్రస్తుత లైసెన్సులు ఈ నెల 31తో ముగుస్తున్నాయి. అత్యవసర పరిస్థితిలో మరో నెల పొడిగించే అవకాశం ఉన్నా, కొత్త లైసెన్సుల మంజూరులోనే గందరగోళం నెలకొంది. ఎందుకంటే, నిబంధనల ప్రకారం ఒక బార్‌కు ఒక దరఖాస్తు మాత్రమే అనుమతించాలి. కానీ తాజాగా ఒక అధికారి సూచన మేరకు పోటీ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఒక్కో బార్ యజమాని నాలుగు దరఖాస్తులు వేయాలని నోటిఫికేషన్ జారీ అయింది. ఒక్కో దరఖాస్తుకు రూ.5 లక్షల ఫీజు నిర్ణయించడంతో, మొత్తం రూ.20 లక్షలు ముందుగానే వదులుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ డబ్బు లైసెన్స్ రాకపోయినా తిరిగి రాని విధంగా నిబంధనలు ఉన్నాయి. దీంతో బార్ యజమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ‌గ‌న్ పాలనలో ఉన్న విధానమే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఎందుకంటే, ఈ కొత్త పాలసీతో సాధారణ బార్ యజమానులు కాకుండా బ‌డా బాబులే ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. చిన్న స్థాయి బార్ యజమానులు ఇంత భారీ మొత్తాన్ని భరించలేరనే వాదన వినిపిస్తోంది. ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ యజమానుల్లో ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులే కావడం. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారినే నేరుగా ప్రభావితం చేస్తోంది. అదే కారణంగా ఈ విషయంలో ప్రభుత్వానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఒకవైపు పెట్టుబడి తగ్గించి కొత్త పాలసీకి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తే, మరోవైపు నాలుగు దరఖాస్తుల షరతు కారణంగా వ్యతిరేకత ఎక్కువైంది. మొత్తం మీద, కొత్త బార్ పాలసీ అమలు విషయంలో ప్రభుత్వం రెండు అంచుల మధ్య చిక్కుకుపోయినట్లుంది. పోటీని పెంచాలని ఉద్దేశించిన నిర్ణయం, చివరికి పెద్ద ఇబ్బందిగా మారింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పాలసీ నిజంగానే అమల్లోకి వస్తుందా, లేక బార్ యజమానుల ఒత్తిడికి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: