కొన్నిసార్లు అభిమానం మితిమీరి పోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమి చేస్తున్నామో తెలియకుండానే ప్రవర్తిస్తాం. అలాంటి కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి, ట్రోలింగ్‌కి కూడా గురవుతాయి. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి సందడి మొదలైన దగ్గర నుంచి ప్రతి ప్రాంతం గణపయ్య భక్తితో మార్మోగిపోతుంది. ఎక్కడ చూసినా “జై బోలో గణేష్ మహరాజ్ కి”, “గణపతి బప్పా మోరియా” అంటూ హంగామా చేస్తూ ఉంటారు. వినాయక చవితి అంటేనే ఆ సందడి  ఆ సందడి లేకపోతే ఎలా? చిన్న, పెద్ద, ముసలి, కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే బిగ్ ఫెస్టివల్ ఇది. చిన్న గల్లీ అయినా, పెద్ద గల్లీ అయినా వినాయక విగ్రహం తప్పక ఉంటుంది. రకరకాల వినాయక విగ్రహాలను చేసి జనాలు ఆనందపడతారు. కొందరు క్రికెటర్ల రూపంలో, మరికొందరు విభిన్న కాన్సెప్టులతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తారు.


అయితే ఈసారి గోషామహల్ నియోజకవర్గంలోని అగాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక చర్చనీయాంశమైంది. అక్కడ గణపయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి గెటప్‌లో ప్రతిష్ఠించారు. ఇది మరీ ఓవర్ అని జనాలు అంటున్నారు. ఈ వినూత్న ఆలోచనతో గణపయ్యను అలంకరించింది స్థానిక ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ అని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక ఉత్సవాలను నిర్వహించే అగాపూర్ కమిటీ ఈసారి “ప్రజలకు దగ్గరగా ఉండే గణపయ్యా” అనే కాన్సెప్ట్‌తో రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా ప్రజలకు నెగిటివ్‌గా వెళ్లింది. “దేవుడు దేవుడే, సీఎం సీఎం.. దేవుడు సీఎం కాలేడు. రెవంత్ రెడ్డి గెటప్‌లో గణపయ్యను తయారు చేస్తే, రెవంత్ రెడ్డి దేవుడవుతాడా?” అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.



అంతేకాదు, “ఇలా చేయడం మహా పాపం” అంటూ ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. కొందరైతే “గణపయ్యను వేరే రూపంలో చేసి ఉంటే బాగుండేది. ఎంతోమంది కన్నీటికి కారణమైన రెవంత్ రెడ్డి లుక్‌ను వినాయకుడితో ఎలా మ్యాచ్ చేస్తారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల “హైడ్రా” పేరుతో తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న విధానంపై చాలామంది సీఎం రెవంత్ రెడ్డికి వ్యతిరేకంగా శాపనార్ధాలు పెట్టారు. అలాంటి వ్యక్తి రూపాన్ని వినాయకుడిగా ప్రతిష్ఠించడం ఎంతవరకు సరైనది అని ప్రశ్నిస్తున్నారు.



మరికొందరైతే, “దేవుడు రూపంలో మనిషి విగ్రహాన్ని చేయడం తప్పు. అది దేవుణ్ని అవమానించినట్లే” అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా యూజర్లు అయితే సటైర్లు వేస్తున్నారు. “ఇది గణపయ్య కాదు.. రెడ్డయ్య మారినా గణపయ్యే” అంటూ మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రెవంత్ రెడ్డి లుక్‌లో ఉన్న గణపయ్య విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొందరు మండిపడుతుంటే, మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. చాలామంది సాధారణ ప్రజలు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: