
ఇటీవల ప్రారంభించిన ‘ఆటో డ్రైవర్ సేవ’ పథకంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.15,000 చొప్పున డబ్బులు జమ చేశారు. కానీ ఆ మెసేజ్‌లలో నిధులు కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుండి వచ్చాయని పేర్కొనడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. “ఇవి ప్రత్యేక కార్పొరేషన్ల నిధులే, వాటిని ఇతర పథకాలకు వాడటం సరి కాదు” అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే అధికార వర్గం వాదన వేరు. “కార్పొరేషన్ల ద్వారా అయినా, సంక్షేమ శాఖ ద్వారా అయినా, చివరికి డబ్బు పేదలకే చేరుతోంది కాబట్టి ఇందులో తప్పేముంది?” అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. కానీ ఆ వాదన అందరినీ నమ్మించలేకపోతోంది. ఎందుకంటే, కార్పొరేషన్లు స్వతంత్రంగా నిర్వహించాల్సిన పథకాలు ఇప్పుడు నిధుల్లేక కుదేలవుతున్నాయి.
ఇటీవలి కాలంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం నిధుల్లేక తమ కార్యక్రమాలు నిలిచిపోయాయని బహిరంగంగా చెప్పారు. ఆ పరిస్థితిలోనే వారి నిధులు ఇతర పథకాల కోసం వాడేయడం వివాదంగా మారింది. లబ్ధిదారులకు మెసేజ్‌ల రూపంలో ఆ వివరాలు వెళ్లిపోవడం వల్ల ఇప్పుడు సర్కారు ఇబ్బందుల్లో పడింది. ప్రజల దృష్టిలో చూసుకుంటే – డబ్బు వస్తే చాలు, ఎక్కడి నుంచి వచ్చిందన్నది పెద్ద విషయం కాదు. కానీ ఆర్థిక నియమావళి పరంగా ఇది సరైన పద్ధతి కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఎన్నికల హామీలు నెరవేర్చడం పేరుతో ప్రభుత్వాలు ఆర్థిక శాసనాలపై కత్తి పెట్టేస్తే, రాబోయే కాలంలో కార్పొరేషన్లు, సంక్షేమం రెండూ కుదేలయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు