తెలుగుదేశం పార్టీ లో మరోసారి అంతర్గత గొడవలు బహిర్గతమయ్యాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు రచ్చగా మారాయి. గతంలో కూడా విజయవాడలో కేశినేని నాని, దేవదత్ మధ్య తగాదా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సీన్‌ తిరువూరులో రిపీట్ అవుతోంది. కొలికపూడి శ్రీనివాస్ రాజకీయాల్లో అమరావతి ఉద్యమం సమయంలో రైతుల పక్షాన నిలబడి ఎదిగారు. మరోవైపు, కేశినేని చిన్ని తన అన్న కేశినేని నానితో విభేదించి, టీడీపీకి కీలకంగా మారారు. ఇద్దరూ మొదటిసారి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై, ఇప్పుడు అదే పార్టీకి చెందినవారైనా పరస్పరం విభేదాలు పీక్‌కు చేరాయి.

 ఇటీవలి కాలంలో తిరువూరులో ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. పార్టీ కార్యకర్తలు ఎవరిని అనుసరించాలో తేల్చుకోలేని స్థితి. ఇదే సమయంలో కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు - “ఎన్నికల్లో కేశినేని చిన్ని నా దగ్గర ఐదు కోట్లు డిమాండ్ చేశాడు. సీటు కావాలంటే కోట్లు ఇవ్వాలి అన్నాడు” అంటూ ఆరోపించారు. అంతే కాదు, వాట్సాప్‌లో బ్యాంక్ స్టేట్‌మెంట్లు కూడా పబ్లిక్ చేశారు. ఈ ఆరోపణలు టీడీపీ లోపల చర్చకు దారితీశాయి. కేశినేని చిన్ని ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. “కొలికపూడికి అంత ఆర్థికస్థోమత లేదు.

కావాలనే బురద జల్లుతున్నాడు” అంటూ కౌంటర్ ఇచ్చారు. తిరువూరు ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా కొలికపూడిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పార్టీ క్రమశిక్షణ సంఘం కొలికపూడి శ్రీనివాస్‌ను వివరణకు పిలిచింది. ఆయన హాజరైనా, వివాదం ఇంకా ముగియలేదు. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే స్థాయిలో ఈ రచ్చ పెరిగిపోవడంతో, చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా, ఆయన రాగానే ఈ వివాదంపై సమీక్ష జరగనుంది. కొలికపూడి–కేశినేని యుద్ధం తారస్థాయికి చేరడం టీడీపీ లోపల చర్చనీయాంశమైంది. చివరికి తేలేది ఒక్కటే - ఎవరి మాటకు హైకమాండ్ మద్దతు ఇస్తుందనేది! చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: