తెలుగుదేశం పార్టీ చరిత్ర స్రుష్టించిన ప్రాంతీయ పార్టీ. అప్పటికి దేశంలో బలమైన జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ని కూకటి వేళ్లతో కూలదోసి మరీ జెగజెట్టీలా దూసుకువచ్చిన టీడీపీ దేశ రాజ‌కీయాల్లోనూ కీలకమైన పాత్ర పోషించింది.  దాదాపుగా మూడున్నర దశాబ్దాలుగా టీడీపీ ఢిల్లీ వేదికగా సాగించిన హవాకు ఇపుడు ఏపీ నుంచే ఆవిర్భవించిన మరో ప్రాంతీయ పార్టీ వైసీపీ అడ్డుకట్ట వేయడం నిజంగా టీడీపీకి షాకింగ్ పరిణామమే.


1984లో తొలిసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నాడు మొత్తం 42 ఎంపీ సీట్లకు గానూ 35 గెలుచుకుని దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది. దాంతో అతి ప్రాముఖ్యత కలిగిన అయిదవ నంబర్ గదిని పార్లమెంట్ ఆవరణలో టీడీపీకి కేటాయించారు. ఈ గది పక్కనే ప్రధాని ఆఫీస్ ఉండడంతో ఈ గదికి చాలా రాజకీయ  విలువ ఉంది. పైగా ఔటర్ సర్కిల్లో ఉండడం వల్ల చాలా సెంటిమెంట్ గదిగా భావిస్తారు.


నాటి నుంచి నేటి వరకూ టీడీపీని ఆ గది నుంచి ఎవరూ కదపలేకపోయారు. 1989లో టీడీపీకి రెండు ఎంపీ సీట్లు వచ్చినా, 2004లో అయిదు, 2009లో ఆరు సీట్లు వచ్చినా కూడా టీడీపీ ఈ గది ఖాళీ చేయలేదు. ఆ విధంగా నాటి టీడీపీ పక్ష నాయకులు ఎర్రన్నాయుడు, నామా నాగేశ్వరరావు వంటి వారు చేసిన లాబీయింగ్ ఉండేది. ఇక టీడీపీకి ఓటమితో సంబంధం లేకుండా నాటి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విలువ ఇస్తూ ఈ గదిని అలాగే ఉంచేసేవారు.


ఇన్నాళ్ళకు టీడీపీని అయిదవ నంబర్ గది ఖాళీ చేయించిన మొనగాడుగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి నిలిచారు. వైసీపీకి లోక్ సభలో 22 మంది రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు ఉండడంతో తమ బలం చూపించి ఆ గదే కావాలని విజయసాయిరెడ్డి లాబీయింగ్ చేశారు. ఇక జగన్ సైతం టీడీపీ అన్నది పార్లమెంట్ ఔటర్ సర్కిల్లో ఎక్కడా కనిపించకూడదన్న పట్టుదలతో తనదైన ఒత్తిడి తెచ్చారని టాక్.


మొత్తం మీద చూసుకుంటే  టీడీపీకి అచ్చివచ్చిన సెంట్మెంట్ గది ఇపుడు వైసీపీ పరమైంది. ఇకపైన ఈ గది నుంచి వైసీపీ తన కార్యకలాపాలు సాగిస్తుంది. దగ్గరలో ప్రధాని ఆఫీస్, పక్కనే బీజేపీ పార్లమెంటరీ ఆఫీస్ కూడా ఉండడంతో వైసీపీకి ఇచ్చిన గది రాజకీయంగా కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్న టీడీపీకి గది అంటూ ఇప్పటికైతే కేటాయించలేదు. మరి చూడాలి. వారికి ఎక్కడ ఇస్తారో. మొత్తానికి టీడీపీకి అలా దెబ్బ పడిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: