ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రుషితేశ్వరి అనుమానాస్పద మృతి కేసులో విచారణ ఊపందుకుంది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి విమర్శలు జోరందుకున్న నేపథ్యంలో.. ఆంధ్రా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ప్రారంభించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్యణ్యం నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ 
యూనివర్శిటీలోనే ఉండి నిజాలు నిగ్దుతేల్చాలని డిసైడైంది. 

ఐతే.. విచారణలో వారికి అనేక చిక్కుముడులు ఎదురవుతున్నాయి. ఈ కేసు విషయంలో సాక్ష్యాల గల్లంతు జరిగిందని కమిటీ భావిస్తోంది. ఆమె ఉరివేసుకుని చనిపోయిందని చెబుతున్నా.. ఆ సమయంలో ఏం జరిగిందనే విషయం బయటికి రాకుండా కుట్ర జరిగిందని ప్రాథమికంగా కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. అధ్యాపకులు, వసతి గృహ ఇన్‌చార్జీలు, విద్యార్థిని తల్లిదండ్రులు.. ఇలా అందరితో మాట్లాడతామని.. నిజాలు నిగ్దు తేలుస్తామని అన్నారు. 

రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సోషల్ మీడియాలోనూ ఆందోళన తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కమిటీ అనేక కోణాల్లో విచారణ సాగిస్తోంది. యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎలా పనిచేస్తోంది.. రిషితేశ్వరిని వేధిస్తూ తీసిన వీడియో ఎలా మాయమైంది? రిషితేశ్వరిని వేధిస్తున్నారంటూ ఆమె చనిపోవడానికి పది రోజుల ముందు ఆమె తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ అంశాలపై కమిటీ దృష్టిసారించింది. 

అయితే.. ఈ కమిటీ విచారణ నిష్పాక్షికంగా ఉండాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు.. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: