హైకోర్టు తీర్పు విషయంలో రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అర్ధమైపోతోంది. హై కోర్టు తీర్పు హైలైట్స్ ను  టీవీలు బ్రేకింగ్ న్యూస్ రూపంలో వేయటం మొదలవ్వగానే నిమ్మగడ్డలో అత్యుత్సాహం మొదలైపోయింది.  కోర్టు తీర్పులకు సంబంధించి మామూలుగా టీవీల్లో వచ్చేది కేవలం కొన్ని పాయింట్లు మాత్రమే. అదికూడా అందరికంటే తామే ముందివ్వాలనే ఆత్రుతలో ప్రతి రిపోర్టరూ ఎవరికి వాళ్ళుగా తమకు అర్ధమైనదాన్ని బ్రేకింగ్ న్యూస్ రూపంలో చెప్పేస్తుంటారు. అసలు జడ్జి తన తీర్పులో ఏమి చెప్పారన్న విషయం తీర్పు కాపీ బయటకు వచ్చిన తర్వాత కానీ తెలీదు.

 

ఇపుడు నిమ్మగడ్డ రూపంలో జరిగింది కూడా అదే.  ఎన్నికల కమీషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును హై కోర్టు కొట్టేసిందని బ్రేకింగ్ రూపంలో వచ్చింది. వెంటనే టివీ చూస్తున్న నిమ్మగడ్డ అప్పటికప్పుడు రెడీ అయిపోయాడు. టీవీల్లో అలా న్యూస్ వచ్చిందో లేదో వెంటనే నిమ్మగడ్డ ఎన్నికల కమీషన్ కార్యదర్శికి ఫోన్ చేసి హైదరాబాద్ లోని తన నివాసానికి వాహనాలను పంపమన్నాడు. కోర్టు తీర్పు ప్రకారం తానే కమీషనర్ గా వస్తున్నట్లు జిల్లాల్లోని అందరికీ సర్క్యులర్ ఇవ్వమని ఆదేశించాడు. పనిలో పనిగా తాను కమీషనర్ గా బాధ్యతల్లోకి దిగిపోయినట్లు ప్రెస్ రిలీజ్ కూడా జారీ చేసేశాడు.

 

పనిలో పనిగా ఎన్నికల కమీషన్ లోకి కొత్త రక్తం ఎక్కించబోతున్నట్లు చెప్పేసి స్టాడింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమని ఆదేశించాడు. రాజీనామాకు కొంత వ్యవధి ఇవ్వమని ప్రభాకర్ కోరితే సాధ్యం కాదు వెంటనే రాజీనామా చేయాల్సిందే అంటూ హూంకరించాడు. ఎన్నికల నిర్వహణపైన కూడా అందరితోను మాట్లాడేశాడు. అసలు ఎన్నికల కమీషన్ అంటే ఎలాగుండాలనే విషయంలో ప్రకటన జారీ చేసేశాడు. ప్రస్తుత కమీషనర్ కనకరాజును వెంటనే తప్పుకోవాలని హుకూం జారీ చేశాడు. తనను తొలగించటంలో ప్రభుత్వం చేసిన కుట్రలను సవివరంగా చెప్పాడు. ఇదంతా అయ్యేటప్పటికి సాయంత్రమైంది.

 

సాయంత్రం  తర్వాత హైకోర్టు నుండి తీర్పు కాపీ వచ్చింది.  అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ దాన్ని చూసి మీడియా సమావేశం పెట్టిన తర్వాత కానీ అసలు విషయం నిమ్మగడ్డకు బోధపడలేదు. ఏమిటంటే నిమ్మగడ్డనే ఎన్నికల కమీషనర్ గా కొనసాగించాలని చెబుతూ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయమని కోర్టు చెప్పింది. అయితే ఎటువంటి గడువు విధించలేదు. అదే సమయంలో ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసుకుని అవకాశం ఉందన్న విషయాన్ని కూడా హై కోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలను పాటించేందుకు ఎటువంటి గడువు ఇవ్వకపోతే రెండు నెలల వ్యవధి తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉందని శ్రీరామ్ చెప్పాడు. పైగా విచిత్రమేమిటంటే ఎన్నికల కమీషనర్ ను నియమించే అవకాశం రాష్ట్రప్రభుత్వానికి లేదని హై కోర్టు తేల్చేయటం.

 

హై కోర్పు తీర్పుపై తాము సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు చెప్పగానే నిమ్మగడ్డతో పాటు చంద్రబాబు అండ్ కో మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. హై కోర్టులో కేసు ఓడిపోతే సుప్రింకోర్టుకు వెళ్ళటం మామూలే కదా ? అంతెందుకు హైకోర్టులో  నిమ్మగడ్డే ఓడిపోయుంటే సుప్రింకోర్టుకు వెళ్ళేవాడు కాదా ? ఇంత చిన్న లాజిక్ కూడా మిస్సయిన నిమ్మగడ్డ ఇపుడు గోల ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావటం లేదు.  మొత్తం మీద హైకోర్పు తీర్పు కాపీ వచ్చే వరకూ నిమ్మగడ్డ  ఓపికపట్టుంటే బాగుండేది. అలాకాకుండా టీవీల్లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ పైన నిమ్మగడ్డ ఆధారపడి ఓవర్ యాక్షన్ చేయటంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లైందని  అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: