తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే 41 మంది వైసీపీ ఎంఎల్ఏలను జైలుకు పంపటం ఖాయమట. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా ఇళ్ళ పట్టాల పంపిణీలో జరిగిన అవినీతి కారణంగా 41 మంది ఎంఎల్ఏలను జైలుకు పంపటం ఖాయమని లోకేష్ బల్లగుద్దకుండానే గట్టిగా చెప్పారు. ఇళ్ళ పట్టాల్లో అవినీతికి పాల్పడిన ఎంఎల్ఏలు ఎవరు ? వారు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారని మాత్రం ఈ మాజీ మంత్రి చెప్పలేదు. తమపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోంది కాబట్టి తాము కూడా వైసీపీ నేతలపై కక్షసాధించాలి అన్నదొకటే అజెండాగా టీడీపీ నేతలు ప్రకటనలు, బెదిరింపులకు దిగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
నిజానికి టీడీపీ చెబుతున్నట్లుగా ఇళ్ళ పట్టాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందనే అనుకుందాం. మరి దానికితగ్గ ఆధారాలను బయటపెట్టాలి కదా ? ఏ నియోజకవర్గంలో ఏ ఎంఎల్ఏ ఏ స్ధాయిలో అవినీతికి పాల్పడ్డాడనే విషయాన్ని జనాలకు వివరించాలి. అప్పుడే టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు జనాలు కూడా కాస్త విలువిస్తారు. లేకపోతే ఏదో ఊకదంపుడు ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి మీద అక్కసుతోనే ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపాడేస్తారు జనాలు. ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబునాయుడు అయినా లోకేష్+టీడీపీ నేతలు చేస్తున్నది ఇదే కాబట్టి. ప్రభుత్వం మొదలుపెట్టిన లేదా మొదలుపెడుతున్న ఏ పథకం విషయంలో కూడా చంద్రబాబు అండ్ కో ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిపోవటాన్ని ఎల్లోబ్యాచ్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈ అసూయలో నుండి వస్తున్నదే ఆరోపణలు, విమర్శలు.
అయితే ఇక్కడ లోకేష్ అయినా మరో నేతైనా చెబుతున్నదేమంటే తాము అధికారంలోకి రాగానే 41 మంది ఎంఎల్ఏలను జైళ్ళకు పంపుతామని. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం వీళ్ళల్లో చాలా బలంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఆ నమ్మకం లేకపోతే వైసీపీ ఎంఎల్ఏలను జైళ్ళకు పంపుతామని ఎలా బెదిరించగలుగుతున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామనే నమ్మకం లోకేష్ లో ఎలాగ వచ్చిందో అర్ధం కావటంలేదు. ఎందుకంటే టీడీపీలో నేతల్లో ఎవరిని కదిలించినా తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం ఎవరిలోను కనిపించటం లేదు. నేతల్లోనే కాదు పార్టీ శ్రేణులు కూడా టీడీపీకి అధికారం అనే విషయాన్ని వదిలిపెట్టేశారు. ఎందుకంటే ఎవరికి కూడా చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేదన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేదెపుడు, ఎంఎల్ఏలను జైళ్ళకు పంపేదెప్పుడు ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి