ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో మహానంది క్షేత్రం కూడా ఒకటి. నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తూ పరమేశ్వరుడే స్వామి రూపంలో వెలిశారు. ఇక్కడి శివలింగం కింది నుంచి సంవత్సరం పొడవునా ఒకే స్థాయిలో స్వచ్చమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంది. సూది సైతం స్పష్టంగా కనిపించేంత స్పష్టతతో ఉండటం ఈ నీటి లక్షణం. 
 
మహానంది స్థల పురాణం ప్రకారం నల్లమల కొండల్లో ఒక మహర్షి చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని జీవించేవారు. ఎల్లప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండే ఆయనను అందరూ శిలాదుడని పిలిచేవారు. మహర్షి భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని భావించగా శిలాదుడు భార్య కోరిక తీర్చేందుకు తపస్సు ప్రారంభించాడు. అనంతరం శివుడు ప్రత్యక్షమై వరాలు కోరుకొమ్మన్నాడు. 
 
మహర్షి  శివున్ని చూసిన పారవశ్యంలో భార్య కోరిన కోరికను మరిచిపోయి నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. పరమశివుడు మహర్షి భార్య ఆకాంక్షను గుర్తుంచుకుని దంపతుల కోరిక సిద్ధిస్తుందని దీవించి వెళ్లిపోయారు. కొంతకాలానికి మహర్షి దంపతులకు మగబిడ్డ జన్మించగా వారు ఆ బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టారు. ఎన్నో విద్యలు నేర్చుకున్న మహానందుడు తల్లిదండ్రుల అనుమతితో శివుడి కోసం తపస్సు చేశాడు. 
 
శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా మహానందుడు నన్ను నీ వాహనంగా చేసుకోమని శివుడిని  కోరతాడు. శివుడు మహానందుడు జన్మించిన పుట్ట నుంచే వచ్చే నీటి ధార కొలనుగా మారి నిరంతరం ప్రవహిస్తూ పవిత్ర వాహినిగా నిలుస్తుందని వరమిచ్చాడు. మహానంది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందంటూ శివుడు వరమిచ్చాడు. ఆ విధంగా మహానంది పుణ్యక్షేత్రం వెలిసింది. కర్నూలు లేదా నంద్యాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు.              

మరింత సమాచారం తెలుసుకోండి: