హిందూ సంప్రదాయం ప్రకారం దసరా ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ దుర్గమ్మ పూజను తొమ్మిది రూపాల్లో అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అంటే అమ్మవారు రోజుకి ఒక్క రూపం ధరిస్తారు అన్నమాట. మూలానక్షత్రం రోజు సరస్వతీ పూజను, అష్టమి రోజు దుర్గాష్టమిగా, ఆయుధ పూజలను, నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు.  దశమిని విజయదశమి అని అంటారు. అయితే దసరా పండగనాడు  బొమ్మల కొలువు పెట్టడం అనేది  దక్షాణాది ప్రజలు ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇదే సంప్రదాయాన్ని ఉత్తరాది ప్రజలు కూడా పాటిస్తున్నారు. అయితే ఒక్క దసరా రోజు మాత్రమే కాకుండా  సంక్రాంతికి, మరికొందరు దీపావళికి కూడా  పాటిస్తారు.



ఏడు, తొమ్మిది లేదా పదకొండు మెట్లు పెట్టి పూజిస్తారు. తొలిరోజున కలశంతో పూజను ప్రారంభించి.. శ్రీవిష్ణుమూర్తి యొక్క దశావతారాలను, అష్టలక్ష్ములూ, క్రిష్ణ లీలలు, త్రిమూర్తులు, శ్రీరామ కుటుంబం, శివ కుటుంబం, క్రిష్ణ బ్రుందావనం, కుచేల స్నేహం, రామాయణ ఘట్టాలవంటివన్నీ ఈ బొమ్మల కొలువులో ఉంటాయి. అలాగే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి దేశ నాయకుల బొమ్మలను కూడా ప్రదర్శిస్తారు. ఇప్పటి కాలంలోని పిల్లలకు మన దేశం సంప్రదాయాలు, ఆచారాలు, నాయకులు, వాళ్ళ త్యాగాలు గురించి ఈ మాత్రం తెలియదు. అందుకనే  మన భారతదేశ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, వారసత్వ విలువలను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే వ్యవహారమే ఈ బొమ్మల కొలువు లక్ష్యం. అయితే ఈ బొమ్మలను బేసి సంఖ్యలో దశలు లేదా శ్రేణులు(7,9 లేదా 11) ఉన్న మెట్ల రూపంలో మాత్రమే  ఏర్పాటు చేయాలి.



వీటిపై తెల్లని బట్టని అమర్చి, దాని మీద క్రమ పద్ధతిలో బొమ్మలను పెడతారు.నవరాత్రి యొక్క తొమ్మిది రాత్రులను సూచించడానికి చాలా మంది తమ ఇళ్లలో బొమ్మల ప్రదర్శన కోసం తొమ్మిది దశలను ఉపయోగిస్తారు. ఈ పవిత్రమైన సమయంలో బొమ్మలను పూజించడం ఆనవాయితీగా పాటిస్తారు.సాధారణంగా ఈ పండుగలో రాముడు, లక్ష్మణ, సీత, క్రిష్ణ, రాధ, శివ, విష్ణు, దుర్గా, లక్ష్మీ, సరస్వతి మొదలైన ప్రతిమలను ఉపయోగిస్తారు.ప్రతి ఇల్లు బొమ్మల పండుగను ప్రారంభించడానికి ఒక సమయాన్ని ఎంచుకుంటుంది. బొమ్మల శ్రేణులు లేదా దశలపై నిర్దిష్ట క్రమం ప్రకారం అమర్చబడి ఉంటాయి.పురాణాల ప్రకారం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించేందుకు దేవతలు ఆమెకు అన్ని శక్తులను ఇచ్చారు. ఈ సమయంలో దేవతలు బలహీనులుగా మారారు. అయితే మహిషాసురుడిపై అమ్మవారు పదో రోజు విజయం సాధించారు. ఆ దేవతల  ఆత్మబలిదానానికి గౌరవం ఇవ్వడానికి బొమ్మల పండుగను దేవతల  రూపంలో పూజించడం ఆచారంగా ఉందని చాలా మంది నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: