ఈ రోజు రంజాన్. ఇది ఓ పవిత్ర పండగ. సంవత్సరంలోని పన్నెండు నెలల్లో 9వ నెల పేరును రమజాన్ అని అంటారు. పవిత్ర ఖురాన్‌ రమజాన్‌ మాసంలోనే అవతరించింది. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపు మనసు పోకుండా కాపాడుతుంది. 

ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్‌ మొదటి తేదీన ఈద్‌ జరుపుకుంటారు. దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం ఈద్‌. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్‌. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.

పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు ముగించుకొని ఫజర్‌ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్‌ నమాజ్‌ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్‌ గాహ్‌లలో కాకుండా మసీదులలోనే మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి, కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, దేశాన్ని, యావత్‌ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవడం సంతరించుకుంటుంది. ‘ఈద్‌ ముబారక్‌’ అంటూ తమతోటివారికి శుభాకాంక్షలు తెలుపుకోవాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్‌ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ పండుగ శభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: