భార‌త క్రికెట్‌లో ఓ చారిత్రాత్మ‌క ద‌శ‌కు తెర‌లేచింది. భార‌త్ బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ద్య డే అండ్ నైట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. డే అండ్ నైట్ మ్యాచ్‌ల‌తో టెస్ట్‌మ్యాచ్‌ల భ‌విత ఎలా ఉండ‌బోతుందో తేలిపోనున్న‌ది. డే అండ్ నైట్‌కు తోడు పింక్ బాల్‌తో టెస్ట్‌ను నిర్వ‌హిస్తున్నారు. పింక్‌ బాల్‌ టెస్ట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్... ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. గులాబీ టెస్టు కోసం ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఇండోర్‌ టెస్ట్‌ మూడు రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులు ఫుల్‌ ప్రాక్టీస్‌ చేశాయి.

 

ప్రత్యేకంగా తడిబంతులతో ఇరు జట్ల ఆటగాళ్లు సాధన చేశారు. ఇక, ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో సత్తా చాటాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌర‌భ్‌గంగూళీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత బెంగాల్‌లో జ‌రుగుతున్న మొదటి మ్యాచ్ కావ‌డం విశేషం.  ఇప్ప‌టి వ‌ర‌కు బంగ్లాదేశ్ జ‌ట్టు డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడ‌లేదు. బంగ్లాదేశ్‌ జట్టుకు ఇదే ఫస్ట్ డే అంట్‌ నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌. ఇండోర్‌లో జ‌గిన మొద‌టి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో చిత్తు చిత్తుగా ఓడిన బంగ్లా టీమ్‌ ఈ మ్యాచ్‌లో కనీస పోటీనైనా ఇవ్వాలని భావిస్తోంది. బంగ్లా బ్యాటింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మాదుల్లా, లిటన్‌ దాస్‌ కీలక బ్యాట్స్‌మెన్‌. వీరి రాణింపుపైనే బంగ్లా విజయావకాశాలు ఆధారపడ్డాయి.

 

ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, అబు జాయేద్‌ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. పింక్‌ బాల్‌తో వీరిద్దరూ స్వింగ్‌ రాబడితే టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు తిప్పలు తప్పవు. ఇండియాలో జ‌రిగే మ్యాచ్‌ల్లో ఎక్కువ‌గా ఇండియానే గెలుస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ పులులు ఎలా విజృంభిస్తారో ఈ మ్యాచ్‌తో తేలిపోతుంది. ఇక మరోవైపు టీమిండియా బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. ఓపెనర్‌ మయాంక్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ, రోహిత్‌, పుజారా, రహానే తమ బ్యాట్‌కు పని చెబితే.. బంగ్లా ఆడ్రస్‌ గల్లంతే. ఇక టీమిండియా బౌలింగ్‌ వరల్డ్‌లోనే ది బెస్ట్‌ ఎటాక్‌గా ఉంది. స్పిన్‌, పేస్‌ విభాగాల్లో సమతూకంగా ఉంది.

 

షమీ, ఉమేశ్‌, ఇషాంత్‌ లాంటి పేస్‌ గుర్రాల్ని తట్టుకుని బంగ్లా బ్యాట్స్‌మెన్‌ నిలబడటం కష్టం. ఇండోర్‌ టెస్ట్‌లో పేసర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ చేతులేత్తశారు. స్పిన్‌ విభాగంలో అశ్విన్‌, జడేజా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను ప‌ట్టేయాల‌ని భార‌త జ‌ట్టు ఆలోచ‌న‌గా ఉంది. భార‌త ఆట‌గాళ్ళు పింక్ బాల్ తో, డే అండ్ నైట్ మ్యాచ్‌లో స‌త్తాచాటి టెస్ట్‌మ్యాచ్‌ల్లో రికార్డు సాధించాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: