బార్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా చివరి టెస్ట్ కు ఇరు జట్లు సిద్దమౌతున్నాయి. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్ట్ లు పూర్తి చేసుకోగా, మొదటి టెస్ట్ లో ఆసీస్ ఘనవిజయం సాధించింది. ఇక రెండవ టెస్ట్ లో ఆసీస్ ను చిత్తు చేసి టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. చెరో విజయంతో ఇక మూడవ టెస్ట్ పై కన్నేసిన ఇరు జట్లు ఊహించని విధంగా డ్రా తో ముగించాయి. ఇక అందరి చూపు బ్రిస్బేన్ వేదికగా జరిగే చివరి టెస్ట్ పై పడింది. బ్రిస్బేన్ లోని గబ్బా లో జరిగే ఈ నాలుగవ టెస్ట్ లో ఇరు జట్లు తాడో పేడో తేల్చుకొనున్నాయి.

ఇదిలా ఉండగా టీమిండియా ఆస్ట్రేలియా టూర్ లో విజయం ఇరు జట్లకు సమంగానే దక్కుతుండడం గమనార్హం. ఆసీస్ టూర్ లో భాగంగా మొదట జరిగిన వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా, టి20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో కూడా విజయం ఇరు జట్లకు దొబుచులాడడం ఆసక్తిని రేపుతుంది. ఇక చివరి టెస్ట్ బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జనవరి 15 నుండి ప్రారంభం కానుంది.‌ మూడో టెస్టులో ప్రదర్శన తర్వాత తాము ఎలాంటి సవాల్‌కైనా సిద్ధమని భారత్‌ నిరూపించగా... కచ్చితంగా మ్యాచ్‌ గెలవాల్సిన స్థితిలో ఆసీస్‌పైనే తీవ్ర ఒత్తిడి ఉంది. ఒక వేళ నాలుగవ టెస్ట్ కూడా డ్రా గా ముగిసిన సిరీస్ భారత్ కైవసం చేసుకోవడం సానుకూలాంశం.

ఇదిలా ఉండగా చివరి టెస్ట్ ప్రారంభానికి ముందు భారత్ ఆటగాళ్లను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే గాయాలతో జడేజా, విహారి చివరి టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించేసింది. అయితే ప్రధాన పేసర్‌ బుమ్రా విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. పొత్తి కడుపులో కండరాల గాయంతో బాధపడుతున్న బుమ్రా 100 శాతం ఫిట్‌గా లేడనేది వాస్తవం. వెన్నునొప్పితో బాధపడుతున్న అశ్విన్‌ పూర్తిగా కోలుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. మరి ఆటగాళ్లను ఇంతగా గాయాలు పట్టి పీడిస్తుండడంతో తుడిజట్టులో ఉండే ఆటగాళ్లపై ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: