ఆగస్టు 27వ తేదీ నుంచి ఆసియా కప్ యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. కానీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నది మాత్రం ఆగస్టు 28 వ తేదీన జరగబోతున్న దాయాదుల పోరు గురించి. పాకిస్థాన్, భారత్ మధ్య జరుగుతున్న పోరును చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ సిద్ధమయ్యారు. అయితే గత ఏడాది ఇలాగే ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ మొదటి సారి భారత్ పై విజయం సాధించి సత్తా చాటింది. మరి ఇప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే గత ఏడాది ప్రపంచ కప్లో టీమ్ ఇండియా ఓటమికి బాటలు వేసింది మాత్రం పాకిస్థాన్ జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న  షాహీన్ అఫ్రిది అని చెప్పాలి.


 టీమిండియా బ్యాట్స్మెన్ లను వరుసగా పెవిలియన్ పంపించడంలో షాహీన్ అఫ్రిది కీలక పాత్ర వహించాడు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా స్టార్ బౌలర్ గా మారిపోయిన షాహీన్ అఫ్రిది గత కొంత కాలం నుంచి కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్థాన్తో మ్యాచ్ సమయంలో షాహీన్ అఫ్రిది ని చూసి భయపడాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.


 భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు కాస్త జాగ్రత్తపడితే షాహీన్ అఫ్రిదిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసాడు డానిష్ కనేరియా. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్లు టీమిండియాలో ఉన్నారు. షాహీన్ అఫ్రిది బౌలింగ్లో వాళ్లు కాస్త జాగ్రత్తగా ఆడితే సరిపోతుంది. అతను బంతిని స్వింగ్ చేస్తున్నాడా లేదా అన్న విషయాన్ని గమనించాలి. బాడీతో కాళ్లతో కాకుండా బ్యాట్ తోనే బంతులను దీటుగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అఫ్రిది బౌలింగ్లో ఎలా ఆడతాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆసియా కప్ లో దినేష్ కార్తిక్ కి ఎంతో కీలకం కానుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: