
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025 షెడ్యూల్‌ను జూన్ 16న అధికారికంగా విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకూ భారతదేశం, శ్రీలంక వేదికలపై హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు. ఇక భారత్, శ్రీలంక మ్యాచ్‌లు భారత్‌లో జరగనున్నాయి. ఇక పాకిస్తాన్ పాల్గొనే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమిస్తోంది.
సుమారు 12 ఏళ్ల విరామం తర్వాత భారత్ మహిళల వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోంది. బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం మైదానాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. శ్రీలంకలో మాత్రం కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్తాన్, భారత్ క్రికెట్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు పాక్ జట్టు భారత్‌లో ఆడకూడదన్న నిబంధనకు అనుగుణంగా ఈ టోర్నీలో పాకిస్తాన్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్:
భారత జట్టు ఈ టోర్నీలో మొత్తం 6 గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. షెడ్యూల్ ఈ విధంగా ఉంది:
సెప్టెంబర్ 30 (మంగళవారం): భారత్ vs శ్రీలంక – బెంగళూరు – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 5 (ఆదివారం): భారత్ vs పాకిస్తాన్ – కొలొంబో – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 9 (గురువారం): భారత్ vs దక్షిణాఫ్రికా – వైజాగ్ – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 19 (ఆదివారం): భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్ – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 23 (గురువారం): భారత్ vs న్యూజిలాండ్ – గౌహతి – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 26 (ఆదివారం): భారత్ vs బంగ్లాదేశ్ – బెంగళూరు – మధ్యాహ్నం 3 గంటలకు
సెమీఫైనల్స్, ఫైనల్ షెడ్యూల్
అక్టోబర్ 29: తొలి సెమీఫైనల్ – గౌహతి లేదా కొలొంబో (పాక్ అర్హత పొందితే)
అక్టోబర్ 30: రెండో సెమీఫైనల్ – బెంగళూరు
నవంబర్ 2: ఫైనల్ – బెంగళూరు లేదా కొలొంబో
ఈ ప్రపంచకప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 2022లో ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అక్టోబర్ 5న కొలొంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోరు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈసారి మహిళల వరల్డ్‌కప్ పట్ల దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. భారత్‌లో మ్యాచ్‌లు జరగడం వల్ల అభిమానులకు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసే అవకాశం కూడా లభించనుంది.