భారతదేశంలో ఈ మధ్యే శాంసంగ్ కొత్తగా ఫోల్డబుల్ మొబైల్ ను లాంచ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. దీనికి స్పందన బాగా లభిస్తుండటంతో శాంసంగ్ మరో కొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇంతకుముందు అడ్డంగా మడత పెట్టే విధంగా ఈ ఫోన్లను రూపొందించగా ఈసారి నిలువుగా మడతపెట్టే విధంగా రూపొందించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను శాంసంగ్ తన డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ వచ్చే సంవత్సరం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. పేరుకే ఫోల్డబుల్ ఫోన్ అయినప్పటికీ డిజైన్ విషయంలో ఇంతకుముందు విడుదల చేసిన ఫోన్ కి, ఈ ఫోన్ కీ చాలా తేడాలు ఉన్నాయి అని తెలిపారు.


ఈ సంవత్సరం ఫోల్డబుల్ ఫోన్ ను విడుదల చేసిన అతి కొద్ది సంస్థల్లో శాంసంగ్ కూడా ఒకటి. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019 సదస్సులో సౌత్ కొరియాకు చెందిన ఈ దిగ్గజ సంస్థ గెలాక్సీ ఫోల్డ్ ను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ చాలా విమర్శలను ఎదుర్కొంది. మడిచే సమయంలో స్క్రీన్ పగిలిపోతూ ఉండటమే ఈ విమర్శలకు ప్రధాన కారణం. శాంసంగ్ కూడా ఆ సమస్యను గుర్తించి వెంటనే సరిదిద్దుకుని దాన్ని సరిచేసింది. 


ఈ కొత్త మొబైల్ ను శాంసంగ్ భారతదేశంతో సహా పలు దేశాల్లో లాంచ్ చేసింది. ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ధర మన దేశంలో రూ.1,64,999గా ఉంది. అయితే ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ సైజు విషయంలో ట్యాబ్లెట్ మాదిరిగా ఉంటుంది. కాబట్టే మడత పెట్టే సమయంలో అడ్డంగా మడత పెట్టేలా దీన్ని తయారు చేశారు. కొత్తగా లాంచ్ చేయబోయే ఫోన్ సైన్ కూడా మొబైల్ లాగానే ఉంటుంది. 


ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతకుముందు మనం ఉపయోగించిన ఫ్లిప్ ఫోన్ల తరహాలో ఈ మొబైల్ ఉండనుంది. ఈ కాన్ఫరెన్స్ లో శాంసంగ్ దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా ప్రదర్శించింది. ఈ వీడియోలో ఆ ఫోన్ వివిధ కోణాల్లో ఎలా ఉంటుంది అని చూపించారు. ఇది కాన్సెప్ట్ డివైస్ కావడంతో లాంచ్ సమయానికి ఇందులో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: