కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే గంటల తరబడి క్యూలైన్లో నిల్చోవల్సి వచ్చేది. అది కూడా టెస్ట్ చేయించుకున్న నాలుగైదు రోజులకు గాని రిపోర్టు వచ్చేది కాదు. రిపోర్టు వచ్చే సరికి కొంతమంది పరిస్థితి విషమించేది. ఇలా కోవిడ్ సమయంలో కరోనా పరీక్ష చేయించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఆతరువాత ల్యాబ్ ల సంఖ్య పెంచడం, ప్రయివేట్ ల్యాబ్ లకు కరోనా పరీక్షల నిర్వహణకు అనుమతివ్వడం, ర్యాపిడ్ కిట్ లు అందుబాటులోకి రావడంతో కోవిడ్ టెస్టులు చేయించుకోవడం మానవుడికి కొంత ఈజీ అయింది.అయినా సామాన్యుడికి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలంటే కొంత భారమే. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు ఉచితం అయినా.. ప్రయివేటు కేంద్రాల్లో చేయించుకోవాలంటూ సామాన్యుడికి భారంగానే చెప్పుకోవాలి. అలాగే కొంత టైం పడుతుంది కూడా. ఇక అలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. అతి త్వరగా గొంతును విశ్లేషించి కరోనా ఉందో లేదో తెలుసుకునే మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చేస్తోంది.వైరస్‌ సోకిన విషయాన్ని స్మార్ట్‌ఫోన్లలోనే క్షణాల్లో తెలుసుకునే యాప్‌ ను నిపుణులు రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సహాయంతో వ్యక్తుల గొంతును విశ్లేషించి కరోనా వైరస్ ఉందో లేదో క్షణాల్లో నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.


సాధారణంగా కరోనా వైరస్‌ శ్వాసకోశ మార్గాలు, స్వరతంత్రుల్లో ప్రభావం చూపుతుంది. ఇది వ్యక్తి గొంతులో మార్పులకు దారితీస్తుందని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు గాను నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గొంతును విశ్లేషించేందుకు  ఉపయోగించే మెల్‌ స్పెక్ట్రోగ్రామ్‌ టెక్నాలజీని పరిశోధకులు ఉపయోగించారు. మూడు సార్లు దగ్గడం, నోటి నుంచి మూడు నుంచి ఐదుసార్లు బిగ్గరగా శ్వాస తీసుకోవడం చేయాలని వాలంటీర్లకు సూచించి.. వాటి ఆడియోలను రికార్డుచేశారు. వాటిని యూనివర్సిటీకి చెందిన క్రౌడ్‌ సోర్సింగ్‌ కొవిడ్‌ సౌండ్స్‌ యాప్‌లో ఉన్న ఆడియో శాంపిళ్లతో విశ్లేషించారు. ఈ ప్రక్రియలో 308 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించిన పరిశోధకులు.. ఈ కొత్త యాప్‌ తో 89 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ యాప్‌.. కొవిడ్‌ను నిర్ధారించడంలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల కంటే కచ్చితమైన ఫలితం ఇవ్వడంతోపాటు చౌకగా ఉండనుందని పరిశోధకులు వెల్లడించారు. ఖరీధైన పీసీఆర్‌ టెస్టులను చేయించుకోలేని పేద దేశాల్లో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. లక్షణాలు లేని వాళ్లలో మాత్రం ఇన్‌ఫెక్షన్‌ను అంత కచ్చితంగా గుర్తించలేక పోతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిలో మాత్రం వైరస్ ను ఈయాప్ సులభంగా గుర్తిస్తుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: