బంగాళాఖాతంలో పుట్టిన ‘మొంథా’ తుఫాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలకూ, ప్రజలకూ భయాందోళనలు కలిగిస్తోంది. ఆదివారం రాత్రి నుంచే ఈ మూడు రాష్ట్రాలు ఫుల్ అలర్ట్‌లోకి వెళ్లాయి. తీరప్రాంతాల్లో గాలి వేగం గంటకు 100 కి.మీ. దాకా చేరే అవకాశం ఉండడంతో, అధికారులు ఏకగ్రీవంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెన్నై తీరంలోని వేలాది మంది ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించబడ్డారు. ఏపీలోనూ కృష్ణా, గుంటూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో తీరప్రాంత ప్రజలను సేఫ్ జోన్లకు మార్చారు. ఒడిశాలోని కళింగపట్నం, గంజాం తీరాల్లోనూ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.


దోబూచులాడే తుఫాన్ .. మొంథా తుఫాను కదలికలే ఇప్పుడు అధికారులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. కొంత సేపు విశాఖ తీరానికి చేరువగా కదులుతూ, అకస్మాత్తుగా కాకినాడ తీరం వైపు మళ్లింది. అంతే కాదు, కొద్ది గంటలకే చెన్నై ఆగ్నేయ దిశగా తచ్చాడడం ప్రారంభించింది. దీని దిశ మార్పులు అంత తేలికగా అర్థం కాని విధంగా ఉన్నాయి. వాతావరణ శాఖ నిపుణులు కూడా “ఈ తుఫాను ఎప్పుడు, ఎటు వైపు దూసుకెళ్తుందో అంచనా వేయడం కష్టం” అంటున్నారు. కొన్నిసార్లు ఇలాంటి తీవ్ర తుఫాన్లు చివరి నిమిషంలో బలహీనపడుతుంటాయి, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం సీరియస్‌గానే ఉన్నాయని నిపుణుల హెచ్చరిక.


ప్రభుత్వాలు హై అలర్ట్‌లో . మూడు రాష్ట్రాలూ ఇప్పుడు ప్రాణ నష్టం లేకుండా ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాయి. తమిళనాడు ప్రభుత్వం కలెక్టర్లకు అదనపు అధికారాలు ఇచ్చింది. ఒడిశాలోనూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తీరప్రాంతాల నుండి ప్రతీ గంటకు సమాచారం తీసుకుంటున్నారు. ఏదేమైనా, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మొంథా తుఫాను ప్రభావం గరిష్ట స్థాయిలో ఉంటుందని అంచనా.



‘మొంథా’ అనే పేరు వెనుక కథ .. తుఫాన్లకు పేర్లు పెట్టే పద్ధతి గత రెండు దశాబ్దాలుగా ఉంది. దీని ఉద్దేశ్యం — ప్రజలకి సులభంగా గుర్తుండడం, సమాచారం త్వరగా చేరడం. బంగాళాఖాతంలో పుట్టే తుఫాన్లకు సాధారణంగా పువ్వుల పేర్లు పెడతారు. ఈసారి థాయ్‌లాండ్ “మొంథా” అనే పేరు సూచించింది. దీని అర్థం - “సువాసన గల పుష్పం.” ఆసక్తికర విషయం ఏమిటంటే, గతంలో వచ్చిన “తిత్లీ” తుఫానుకూ ఇదే అర్థం ఉంది. ప్రస్తుతం మొంథా దిశ మార్పులు, తీవ్రత చూస్తే ఇది చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడంతో పెద్ద నష్టం జరగకూడదని ప్రజలూ ఆశిస్తున్నారు. అయినా ఒక్కసారి గాలివానలు మొదలైతే — మొంథా సువాసన పువ్వు కంటే, ప్రకృతిశక్తి భీకర రూపంలో మారే అవకాశం ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: