భారత్‌లో బ్యాన్ చేసిన చైనీస్ యాప్ టిక్ టాక్. దీన్ని బ్యాన్ చేయడానికి ముందు ఇంత బాగా పాపులర్ అయిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్ మరోటి లేదనడం తప్పేమీ కాదు. అయితే మనం బ్యాన్ చేసినట్లు దీన్ని అన్ని దేశాలూ నిషేధించలేదు. అమెరికా ప్రభుత్వం టిక్ టాక్ బ్యాన్ చేస్తానని బెదిరిస్తూ వచ్చినా, ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదు. దీంతో అక్కడ ఈ యాప్ ఇంకా అందుబాటులోనే ఉంది.

ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి రికార్డు సృష్టించింది. టిక్ టాక్‌లో 100 మిలియన్ల అంటే 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించింది. ఈ రికార్డు సాధించిన తొలి టిక్‌టాకర్‌ ఆమే కావడం విశేషం. చార్లీ డీ అమీలియా అనే ఈ అమ్మాయి అకౌంట్‌.. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఖాతాగా నిలిచింది. మరో గొప్ప విశేషం ఏంటంటే.. అమీలియా టిక్ టాక్ ఉపయోగించడం మొదలెట్టింది గతేడాదే. 2019 మే నుంచి ఆమె టిక్ టాక్ ఉపయోగిస్తోంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పోస్టులు పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

మరి ఇంతగా అభిమానులతో కలిసి ఉండటం వల్లే ఆమె ఫాలోవర్ల సంఖ్య 10 కోట్ల మార్క్ దాటింది. ప్రస్తుతం టిక్ టాక్‌లో ఆమె ఫాలోవర్స్.. హాలీవుడ్ స్టార్ హీరో విల్‌స్మిత్ కంటే రెండింతలు ఎక్కువ. అలాగే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాల స్టార్, ప్రొఫెషనల్ రెజ్లర్ డ్వేన్ స్మిత్ ఫాలోవర్ల కంటే మూడింతలు ఎక్కువ మంది అమీలియాను ఫాలో చేస్తున్నారు. చాలా దేశాల్లో విపరీతంగా పాపులర్ అయిన టిక్ టాక్‌ను భారత్‌లో బ్యాన్ చేశారు. భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా చైనీస్ యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది. వాటిలో టిక్ టాక్ కూడా ఒకటి. మరి సరిహద్దుల్లో పరిస్థితి కొంత చక్కబడిన తర్వాత మళ్లీ టిక్ టాక్ అందరికీ అందుబాటులోకి వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: