ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ వస్త్ర వ్యాపార వెబ్‌సైట్ మింత్రాపై లోగో మారనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా ప్రకటిచింది. మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందంటూ ఆరోపిస్తూ ముంబైలో కేసు నమోదైంది. దీంతో మింత్రా ఈ నిర్ణయం తీసుకుంది. అవెస్తా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నాజ్ పటేల్ గతేడాది డిసెంబరులో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు మింత్రా లోగోపై ఫిర్యాదు చేశారు. అది అభ్యంతరకరంగా ఉందని, మహిళలను అవమానపరిచేలా ఉందని తన ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా ఆ లోగోను వెంటనే తొలగించాలని, పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో కూడా పంచుకున్నారు.
           
నాజ్ పటేల్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో కూడా మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందని నిర్ధారణ అయింది. దీంతో మింత్రా సంస్థకు పోలీసులు నోటీసులు పంపించారు. లోగో విషయంలో వెంటనే తమను సంప్రదించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై స్పందించిన మింత్రా ఓ నెల రోజుల లోపు తమ లోగోను మార్చేస్తామని హామీ కూడా ఇచ్చిందట. ఈ మేరకు ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండికార్ వెల్లడించారు.

అంతేకాకుండా వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లోనూ తమ లోగోను మార్చనున్నట్లు మింత్రా తాజాగా ప్రకటన చేసింది. అలాగే, ప్యాకేజింగ్ మెటీరియల్‌పైన కూడా పాత లోగో రాకుండా చర్యలు తీసుకుంటామని మింత్రా పేర్కొంది. కొత్త లోగోతో ఇప్పటికే ప్యాకేజింగ్ మెటీరియల్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు వెల్లడించింది. అంటే ఇక నుంచి మింత్రా పాత లోగో మనకు కనిపించదన్నమాట. అయితే కొత్త ఎలా ఉంటుంది..? దానిని ఎలా మింత్రా ఎలా డిజైన్ చేయిస్తుంది..? అనే విషయాలపై వినియోగదారులు తెగ ఆసక్తిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: