ఇక ఎక్కువ సమయం నిలబడి చేసే పనిలో ఉంటే ఫర్వాలేదు కానీ ఇంతకుముందు అలవాటు లేకుండా గర్భం ధరించిన తర్వాత ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండడం ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. మొదటి త్రైమాసికంలో చాలామంది మార్నింగ్ సిక్ నెస్, కళ్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. నిలబడడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువవుతాయి.
సాధారణంగా ఇంటి పనుల్లో భాగంగా ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, వంటివి చేయడానికి కిందకి వంగాల్సి వస్తుంది. అయితే ఇలా వంగడం గర్భం ధరించిన తర్వాత అంత మంచిది కాదు. ఇలాంటి పనులకు మీరు వంగకుండా కింద కూర్చొని చేయడం శ్రేయస్కరం. ఎందుకంటే వంగడం వల్ల మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోయి మీకు సయాటిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే పెరిగిన పొట్టతో కిందకు వంగడం వల్ల ఊపిరి ఆడకపోవడం వంటి సమస్య కూడా ఎదురవుతుంది.
గర్భిణులు బరువులు ఎత్తే పనులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో బరువులు మోయడం వల్ల కడుపులోని బిడ్డకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. నడుము నొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ పెల్విక్ కండరాలు, ఎముకలు అన్నీ హార్మోన్ల ప్రభావం వల్ల పెళుసుగా మారుతుంటాయి.
చాలా వరకూ గర్భం ధరించిన తర్వాత కూడా ఇల్లు తుడవడం, బాత్రూంలు కడగడం వంటి పనులు ఆడవారే చేస్తుంటారు. కానీ వీటికి ఉపయోగించే కెమికల్స్ వల్ల కడుపులోని బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చీమలు, బొద్దింకలు చంపేందుకు ఉపయోగించే మందుల్లో ఎక్కువగా ఉండే పైపెరొనిల్ బ్యుటాక్సైడ్ వల్ల కడుపులోని బిడ్డ మెదడు పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ తరహా కెమికల్స్ కి వీలైనంత దూరంగా ఉండాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి