రెడ్లు అంటే నీకు కోప‌మా?  ఆ సామాజిక‌వ‌ర్గం నీకేమ‌న్నా ద్రోహం చేసిందా?  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా మీరు ఎందుకు సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెడుతున్నారు?  దీనివ‌ల్ల మీకు ప్ర‌యోజ‌న‌మేంటి? ఎవ‌రైనా ఇలా పెట్ట‌మ‌ని మిమ్మ‌ల్ని కోరారా?  లేదంటే మిమ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నారా? అంటూ గుంటూరు సీఐడీ పోలీసులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామానికి చెందిన 63 సంవ‌త్స‌రాల చేరెడ్డి  జనార్ద‌న్ సామాజిక మాధ్యమాల్లో ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా వ‌స్తున్న పోస్టుల‌ను ఇత‌రుల‌కు పంపిస్తున్నారు. దీన్ని గురించి సీఐడీ పోలీసులు ఆయ‌నింటికి వెళ్లి ప్రాంతీయ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజురుకావాలంటూ నోటీసులిచ్చారు. త‌న భార్య ఝాన్సీరాణితో క‌లిసి జనార్ద‌న్ విచార‌ణ‌కు రాగా ఆమెను బ‌య‌టే ఉంచి జ‌నార్ద‌న్ ఒక్క‌రినే సీఐడీ అధికారులు విచారించి పైన పేర్కొన్న ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. తాను ఏ పార్టీ కాద‌ని, తాను ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని జ‌నార్ద‌న్ వారికి స్ప‌ష్టం చేశారు. మ‌రోసారి ఇటువంటి పోస్టులు పంపిస్తే అరెస్ట్ చేస్తామ‌ని హెచ్చ‌రించిన సీఐడీ అధికారులు జ‌నార్ద‌న్‌ను సొంత పూచీక‌త్తుపై విడుద‌ల చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tag