మన్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. స్మగ్లర్లు తెగబడ్డారు, గాల్లోకి రాళ్లు రువ్వారు. ఏకంగా పోలీసులకే ఎదురుతిరిగారు. చివరకు తుపాకులు గర్జించాయి. లంబసింగి ఘాట్ రోడ్ లో పోలీసులపై కొందరు స్మగ్లర్లు రాళ్లు,కత్తులు, గొడ్డళ్ళతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడిలో పోలీస్ వాహనం ధ్వంసం కాగా, ఇద్దరు స్మగ్లర్ల  కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ లో గంజాయి కి బానిసైన వ్యక్తి ఆరేళ్ల బాలిక ను చిదిమేసిన ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం  గంజాయి రవాణా ను అరికట్టేందుకు కార్యాచరణకు దిగింది. దీంతో ఇటీవల అరెస్టు చేసిన స్మగ్లర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నల్గొండ డిఐజి ఎస్పీ ఏవి రంగనాథ్ సూచనలతో 13 బృందాలు ఈ నెల 14 నుంచే రంగంలోకి దిగాయి.

 ఒక్కో సీఐ నేతృత్వంలో ఆరుగురు పోలీసులతో కూడిన  బృందాలు ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల సహకారంతో లంబసింగి, నర్సీపట్నం, దారంకొండ, రత్నవరం, గంగవరం, సీలేరు,కొండరాయి ప్రాంతాల్లోని గంజాయి క్షేత్రాల్లో దాడులకు దిగారు. అలా దాడులు చేస్తున్న క్రమంలో 20 మందికి పైగా  ముఠా పోలీసులపై దాడి చేసింది. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి హాని జరగలేదు. గత కొద్దికాలంగా నల్గొండ జిల్లాలో చాపకింద నీరులా  సాగుతున్న గంజాయి వ్యాపారంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

 కోదాడ నుంచి చౌటుప్పల్ వరకు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. హైవేపై తనిఖీలే కాకుండా జిల్లా వ్యాప్తంగా సరుకు రవాణా చేస్తున్న ముఠా లు దాన్ని వాడుతున్న వారిని కట్టడి చేస్తున్నారు. వాహనాల తనిఖీలలో దొరుకుతున్న గంజాయి కుప్పల్ని చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. దీంతో  సివిల్ పోలీసులకు తోడుగా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ లను సైతం రంగంలోకి దించారు.  ఈ క్రమంలో జిల్లా మీదుగా సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాకుండా జిల్లాలో గంజాయి సరఫరా  ముఠాను ఏరి వేయడం పైన పోలీసులు ఫోకస్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: